Sahaja Reddy: అమెరికాలో అగ్ని ప్రమాదం... చదువు పూర్తవుతున్న సమయంలో సహజారెడ్డి దుర్మరణం

Sahaja Reddy Dies in US Apartment Fire During Studies
  • బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి
  • జోడిమెట్లలో ఉంటున్న కుటుంబ సభ్యులకు తెలియజేసిన అధికారులు
  • నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సహజారెడ్డి
  • చదువు పూర్తవుతున్న సమయంలో మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఇద్దరు అగ్నికి ఆహూతయ్యారు. మృతి చెందిన వారిలో హైదరాబాద్‌కు చెందిన యువతి ఉడుముల సహజారెడ్డి (24) కూడా ఉన్నారు. జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రులకు అధికారులు ఈ విషాద వార్తను తెలియజేశారు.

సహజారెడ్డి ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆమె చదువులు పూర్తవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సహజారెడ్డి మృతితో శ్రీనివాస కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలోని భారత ఎంబసీ ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపింది.

స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పని చేసి, డిప్యుటేషన్‌పై ఇటీవల హైదరాబాద్ వచ్చారు. కొన్నేళ్లుగా వీరి కుటుంబం జోడిమెట్లలో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్‌లోనే బీబీఎస్ కోచింగ్ తీసుకుంటోంది.

పెద్ద కుమార్తె సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్లారు. సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఆ సమయంలో నిద్రలో ఉన్న సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని మృతి చెందారు.
Sahaja Reddy
US Fire Accident
Birmingham Fire
Telugu Students
Apartment Fire

More Telugu News