Andhra Pradesh: సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడిన ఐదో తరగతి విద్యార్థి

Fifth Class Student Saves Mother From Electric Shock in West Godavari
  • కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని కాపాడిన బాలుడు
  • మోటార్ స్విచ్ ఆపి కర్రతో వైర్‌ను తొలగించిన ఐదో తరగతి విద్యార్థి
  • బాలుడి సమయస్ఫూర్తిని ప్రశంసించిన ఉపాధ్యాయులు, స్థానికులు
  • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘటన
ఆడుతూపాడుతూ తిరిగే వయసులో ఓ బాలుడు అసాధారణ ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. కరెంట్ షాక్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్నతల్లిని చాకచక్యంగా కాపాడుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిన్న‌ పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహించారు. జొన్నలగరువు ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న దీక్షిత్ అనే విద్యార్థి.. తన తల్లి మీటింగ్‌కు రాకపోవడంతో ఆరా తీసేందుకు ఇంటికి వెళ్లాడు. అక్కడ తల్లి కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతుండటం చూసి నిశ్చేష్టుడయ్యాడు.

అయితే, ఏమాత్రం భయపడకుండా దీక్షిత్ వెంటనే తేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచే సమయం కూడా లేదని గ్రహించి, నేరుగా కరెంట్ సరఫరాకు కారణమైన మోటార్ స్విచ్‌ను ఆపేశాడు. అనంతరం ఓ కర్ర సాయంతో తల్లిపై పడి ఉన్న కరెంట్ వైర్‌ను తొలగించాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

వెంటనే తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించి పంపించారు. ఆ తర్వాత తల్లిని వెంటబెట్టుకుని దీక్షిత్ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్‌కు హాజరయ్యాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు బాలుడి ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని అభినందించారు. కరెంట్ షాక్ తగిలినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలిసిన పెద్దలు కూడా కంగారుపడతారని, కానీ చిన్న వయసులోనే దీక్షిత్ చూపిన తెగువ ప్రశంసనీయమని కొనియాడారు.
Andhra Pradesh
Deekshith
West Godavari
Electric Shock
Student saves mother
Parents Teachers Meeting
Jonnalagaruvu
Fifth Class Student
Bhimavaram
Government School

More Telugu News