Telangana High Court: హిల్ట్ పాలసీపై స్టేకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ.. ప్రభుత్వానికి ఊరట

Telangana High Court Refuses Stay on HILT Policy Relief to Government
  • ఇది కేవలం విధానపరమైన ప్రకటనేనన్న ప్రభుత్వ వాదనతో ఏకీభావం
  • కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
  • కాలుష్య పరిశ్రమల తరలింపుకే పాలసీ తెచ్చామన్న అడ్వకేట్ జనరల్
  • మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ పిటిషనర్ల ఆందోళన
హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ (హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టైల్ టౌన్‌షిప్) పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి కోర్టుకు వివరించడంతో ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిల్ట్ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ప్రభుత్వం నవంబర్ 22న జారీ చేసిన జీవో 27 హెచ్‌ఎండీఏ చట్టానికి, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ శ్యాంకోసీ, జస్టిస్ చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్‌రెడ్డి వాదిస్తూ, పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య సముదాయాలకు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై స్టే విధించకపోతే ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్‌ను "గ్రీన్ సిటీ"గా మార్చే లక్ష్యంతోనే కాలుష్య పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించేందుకు ఈ పాలసీని తెచ్చామని తెలిపారు. బాలానగర్, కూకట్‌పల్లి, కాటేదాన్ ప్రాంతాల్లో కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది కేవలం విధానపరమైన నిర్ణయమని, హెచ్‌ఎండీఏ చట్టం ప్రకారమే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, మాస్టర్ ప్లాన్‌ను సవరిస్తామని, అందుకు ఇంకా సమయం ఉందని స్పష్టం చేశారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరిస్తూ విచారణను వాయిదా వేసింది. 
Telangana High Court
HILT policy
Hyderabad Integrated Lifestyle Township
Industrial land
HMDA
K A Paul
Purushotham Reddy
G. Sudarshan Reddy
Real estate Hyderabad

More Telugu News