అమెరికాలో అగ్నిప్రమాదం... ఇద్దరు తెలుగు విద్యార్థులకు తీవ్ర గాయాలు

  • అలబామాలో అగ్ని ప్రమాదం
  • విద్యార్థులుంటున్న అపార్ట్‌మెంట్‌లో మంటలు
  • బాధితులకు అండగా నిలిచిన తెలుగు సంఘాలు
అమెరికాలోని అలబామా రాష్ట్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌ నగరంలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వీరు అలబామా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 10 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరుంటున్న భవనంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికాలోని తెలుగు సంఘాలు, యూనివర్సిటీ అధికారులు బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


More Telugu News