మీ దేవుడి విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా?: జగన్‌పై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్

  • పరకామణి దొంగతనంపై జగన్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ ఆగ్రహం
  • కల్తీ నెయ్యి, చోరీ వ్యవహారంపై బహిరంగ చర్చకు సవాల్
  • సిట్ అధికారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
వైసీపీ అధినేత జగన్ పై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి వాడకంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అంశాలపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ మాట్లాడారని ఆరోపించారు.

శ్రీవారి ఆలయానికి సంబంధించిన వ్యవహారాలపై జగన్ ఎగతాళిగా మాట్లాడటం దారుణమన్నారు. "శ్రీవారి ఖజానాలో చోరీ జరిగితే దాన్ని చిన్న చోరీ అంటారా? మీ దేవుడి విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా?" అని జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. పరకామణి చోరీ తర్వాత జరిగిన రాజీ వ్యవహారంలో జగన్‌కు కూడా వాటా ఉందేమోనని భానుప్రకాశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. "ఇకపై దొంగతనాలు చేసిన వాళ్లు మీ దగ్గరికి వస్తే రాజీ చేయిస్తారా?" అని ఎద్దేవా చేశారు.

తాము దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం లేదని, గత వైసీపీ ప్రభుత్వమే దేవుడిని రాజకీయాలకు వాడుకుందని విమర్శించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. గోపూజలు చేసే వైవీ సుబ్బారెడ్డి కల్తీ నెయ్యిపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సిట్ అధికారులను విమర్శించడం సరికాదని, వారికి జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.



More Telugu News