Nara Lokesh: నాన్న నా పీటీఎంకు ఎప్పుడూ రాలేదు... కానీ మీరు అదృష్టవంతులు: మంత్రి లోకేశ్

Nara Lokesh Speech at Mega PTM 40 in AP Model School
  • మెగా పీటీఎం వేదికగా విద్యారంగంపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు
  • ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తల్లి త్యాగాన్ని గుర్తు చేసిన లోకేశ్
  • పాఠశాలల నుంచి రాజకీయాలను పూర్తిగా దూరం చేశామని స్పష్టీకరణ
  • విద్యా సంస్కరణల కోసం పవన్ కల్యాణ్ సలహాలు తీసుకుంటున్నామన్న మంత్రి
"మిమ్మల్ని చూస్తుంటే నా పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి. మాది క్లాసులో అల్లరి బ్యాచ్. మా టీచర్ ఎప్పుడూ అమ్మకు ఫిర్యాదు చేసేవారు. మా నాన్న నా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు (పీటీఎం) ఎప్పుడూ రాలేదు. కానీ, ఈ రోజు మీ పీటీఎంకు ఏకంగా ముఖ్యమంత్రే వచ్చారు. ఈ విషయంలో మీరంతా చాలా అదృష్టవంతులు" అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భావోద్వేగంగా అన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా తాను తన కుమారుడు దేవాన్ష్ పీటీఎంకు తప్పకుండా వెళతానని తెలిపారు.

తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని ఏపీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన 'మెగా పీటీఎం 4.0' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

ఆయన తల్లి త్యాగం మరువలేనిది

చదువు విలువను, తల్లిదండ్రుల త్యాగాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా మంత్రి లోకేశ్ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితంలోని ఒక ముఖ్య ఘట్టాన్ని వివరించారు. 

"ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజుల్లో, సుబ్బమ్మ అనే తల్లి తన కొడుకుని ఎంతో కష్టపడి చదివించింది. ఒకసారి కొడుకు ఫీజు కోసం మూడు రూపాయలు కట్టాల్సి రాగా, ఆమె వద్ద డబ్బులు లేవు. తన పుట్టింటి వారు ఇచ్చిన పట్టుచీరను తాకట్టు పెట్టి ఆ ఫీజు కట్టింది. తల్లి పడిన ఆ కష్టాన్ని చూసిన కొడుకు పట్టుదలతో చదివి బారిస్టర్ అయ్యారు. పత్రికా సంపాదకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా బ్రిటిష్ వారిని ఎదిరించి నిలిచారు. స్వాతంత్య్రం వచ్చాక సమైక్య ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. తల్లిదండ్రుల త్యాగాల వల్లే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని, వారి కలలను నిజం చేయాల్సిన బాధ్యత మీపై ఉందని" లోకేశ్ విద్యార్థులకు హితవు పలికారు. 

పాఠశాలల్లో రాజకీయాలకు ఫుల్ స్టాప్

విద్యావ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. "పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదన్నది మా ప్రభుత్వ విధానం. అందుకే ఇప్పుడు ఏ పాఠశాలలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా నా ఫొటోలు కనిపించవు. పాఠశాల భవనాలకు పార్టీ రంగులు లేవు, రాజకీయ కార్యక్రమాలు లేవు. విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్టూడెంట్ కిట్స్, డొక్కా సీతమ్మ గారి పేరుతో సన్న బియ్యంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం" అని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, వన్ క్లాస్ - వన్ టీచర్ విధానం, క్లిక్కర్ టెక్నాలజీ, పారదర్శక ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలకు స్టార్ రేటింగ్స్ వంటివి అమలు చేస్తున్నామని తెలిపారు.

పవనన్న సలహాలు ఇస్తున్నారు

విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తున్నారని లోకేశ్ తెలిపారు. "పవనన్నతో స్కూళ్ల స్థితిగతులపై చర్చిస్తున్నాం. మేమంతా ఒక టీమ్‌గా పనిచేస్తున్నాం. మేం యువకులం, ఉత్సాహవంతులం. మేం మిసైల్స్ అయితే, మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జీపీఎస్ లాంటి వారు. ఆయన మాకు దిశానిర్దేశం చేస్తారు" అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలతో పాటు ఆటలు, యోగా వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఏపీ ప్రజలు గర్వపడేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు కోన శశిధర్, విజయరామరాజు, బి.శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
AP Model School
Mega PTM 4.0
Chandrababu Naidu
Pawan Kalyan
AP Education System
Andhra Kesari
Tanguturi Prakasam Pantulu
Student Kits
Bamini

More Telugu News