పండుగలా మెగా పీటీఎం.. విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు

  • పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్
  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రారంభం
  • ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
  • విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం, మంత్రి లోకేశ్‌
  • విద్యార్థుల ప్రదర్శనలు, నైపుణ్యాలను అభినందించిన ముఖ్యమంత్రి
పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన 'మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (పీటీఎం)' పండుగ వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రెండు కీలక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ఆయన 'గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)', 'క్లిక్కర్' విధానాలకు శ్రీకారం చుట్టారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నేరుగా సంభాషించారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాప్ పనితీరును మంత్రి లోకేశ్‌ సీఎంకు వివరించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, వారి ప్రోగ్రెస్ రిపోర్టులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో వీడియో ప్రదర్శించి 'క్లిక్కర్' విధానం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేశారు. ఈ విధానం కోసం 2,300 వీడియోలు సిద్ధం చేసినట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పాఠశాలలోని స్పోర్ట్స్ రూమ్, స్కిల్ అండ్ లెర్నింగ్, స్టెమ్ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థుల ఆవిష్కరణలను, ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించి, పాఠశాల పనితీరు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు.

నైతిక విలువలు, పరిసరాల పరిశుభ్రత, ఆత్మరక్షణపై ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జి.బాబురావు పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థి కేదార్ సాయి నైతిక విలువలను పద్యాల రూపంలో చెప్పడం ఆకట్టుకుంది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాల్య వివాహాలపై ఇంటర్ సెకండియర్ విద్యార్థిని సీహెచ్ శోభారాణి ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం బాలికల ఆత్మరక్షణను వివరిస్తూ 6 నుంచి 12వ తరగతి విద్యార్థినులు బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ను పదర్శించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ భోజనం చేశారు. 

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ రాష్ట్ర కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, భామిని ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.బాబూరావు, పాఠశాల ఎస్ఎంసీ ఛైర్మన్ వానపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News