Aishwarya Rai: ఆ కిరీటంతోనే నా జీవితం మారింది: ఐశ్వర్యారాయ్

Aishwarya Rai Says Miss World Changed Her Life
  • 1994 మిస్ వరల్డ్ కిరీటంతో నా జీవితమే మారిపోయిందన్న ఐశ్వర్యరాయ్
  • భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికే పోటీల్లో పాల్గొన్నానని వెల్లడి
  • 'దేవదాస్' సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అన్న ఐశ్వర్య 
ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇటీవల రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె అన్నారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఐశ్వర్య ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ వేదికపై ఐశ్వర్య మాట్లాడుతూ, 1994లో తాను అనుకోకుండానే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు. దానిని కేవలం అందాల పోటీగా భావించలేదని, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశంగా చూశానని వెల్లడించారు. ఆ రోజుల్లో మన దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసనే విషయం తనను ఆశ్చర్యపరిచిందని, అందుకే అక్కడ మన దేశ గొప్పతనాన్ని వివరించానని తెలిపారు.

ఆ టైటిల్ గెలిచిన తర్వాత తన జీవితం కీలక మలుపు తీసుకుందని ఐశ్వర్య అన్నారు. "విశ్వసుందరిగా గెలిచాక, ప్రముఖ దర్శకుడు మణిరత్నం గారి 'ఇరువర్' సినిమాతో తెరంగేట్రం చేశాను. అదే ఏడాది బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. నా కెరీర్‌లో 'దేవదాస్' ఒక మైలురాయి లాంటిది. ఆ సినిమా తర్వాత కథల ఎంపికపై నాకు పూర్తి స్పష్టత వచ్చింది" అని వివరించారు. తనను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఐశ్వర్యారాయ్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్ 2'లో కనిపించారు. 
Aishwarya Rai
Aishwarya Rai Bachchan
Miss World
Red Sea Film Festival
Ponniyin Selvan 2
Bollywood
Maniratnam
Iruvar
Devdas
Indian Cinema

More Telugu News