Indigo Airlines: అస్తవ్యస్తంగా ఇండిగో సర్వీసులు.. 2026 ఫిబ్రవరి వరకు కష్టాలే!

Indigo Airlines promises to restore normalcy by February 2026
  • పైలట్ల కొరతతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్
  • నాలుగో రోజూ కొనసాగుతున్న విమానాల రద్దు
  • ప్రయాణికులకు తప్పని తిప్పలు
  • దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం
  • పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ జోక్యం
  • 2026 నాటికి సాధారణ స్థితికి వస్తామని ఇండిగో హామీ
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల నిర్వహణలో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. వరుసగా నాలుగో రోజు శుక్రవారం కూడా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి, నీళ్లు లేకుండా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. పైలట్ల కొరత, కొత్త నిబంధనల అమలులో యాజమాన్యం ప్రణాళిక లోపమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

నిన్న ఒక్కరోజే ఇండిగో 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. సాధారణంగా రోజుకు 170-200 సర్వీసులు రద్దు చేసే ఇండిగో, ఒక్కసారిగా ఈ స్థాయిలో విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్‌లో 75, కోల్‌కతాలో 35 విమానాలు రద్దయ్యాయి. దీంతో పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా వంటి ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

విమానాశ్రయాల్లో ఎటుచూసినా ప్రయాణికుల ఆందోళనలే కనిపించాయి. కౌంటర్ల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ప్రత్యామ్నాయ విమానాలపై స్పష్టత లేకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాశారు. కొందరు తమ లగేజీపైనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "బెంగళూరు వెళ్లే విమాన టికెట్ ధర ఓ టేలర్ స్విఫ్ట్ సంగీత కచేరీ టికెట్ కన్నా ఎక్కువైపోయింది" అని ఓ ప్రయాణికుడు వాపోయాడు. మరోచోట ఇండిగో సిబ్బందిని ప్రశ్నించగా.. "విమానం సిద్ధంగా ఉంది, కానీ నడపడానికి పైలట్ లేడు" అని సమాధానం ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ఇండిగో యాజమాన్యంతో అత్యవసర సమావేశాలు నిర్వహించి, కార్యకలాపాలను వెంటనే గాడిలో పెట్టాలని ఆదేశించింది. పైలట్ల పనివేళలు, విశ్రాంతికి సంబంధించిన కొత్త నిబంధనల (FDTL) అమలులో ఎంత మంది సిబ్బంది అవసరమో అంచనా వేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ గుర్తించింది.

కాగా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో క్షమాపణలు చెప్పింది. 2026 ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకొస్తామని డీజీసీఏకు హామీ ఇచ్చింది. అయితే, రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు రద్దు కావచ్చని, డిసెంబర్ 8 నుంచి సర్వీసులను తగ్గిస్తామని తెలిపింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని చూసుకున్నాకే ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించింది.
Indigo Airlines
Indigo flights
flight cancellations
DGCA
pilot shortage
airline crisis
airport chaos
flight delays
aviation news

More Telugu News