YS Jagan Mohan Reddy: రైతులను మోసం చేసిన చరిత్ర జగన్‌ది: మంత్రి నాదెండ్ల

YS Jagan Mohan Reddy Deceived Farmers Says Minister Nadendla Manohar
  • జగన్ మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్న మంత్రి
  • రైతులను దగా చేసిన వైసీపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శ
  • కేవలం 4 గంటల్లో రూ.3,350 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడి
  • రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 50 వేల టార్పాలిన్లు ఉచితంగా అందిస్తున్నామన్న నాదెండ్ల
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఆయన మాయమాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. వైసీపీ పాలనలో రైతులను నిలువునా ముంచి, దళారుల వ్యవస్థను ప్రోత్సహించిన చరిత్ర జగన్‌దని, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైతులకు భరోసా కల్పించారని మనోహర్ తెలిపారు. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రూ.3,350 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని గర్వంగా చెబుతున్నామన్నారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు 50 వేల టార్పాలిన్లను ఉచితంగా అందిస్తున్నామని, ప్రతి రైతు సహాయక కేంద్రంలో 30 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని వివరించారు.

ధాన్యం కొనుగోళ్లలోనూ తమ ప్రభుత్వ పనితీరు స్పష్టంగా కనిపిస్తోందని నాదెండ్ల అన్నారు. వైసీపీ ప్రభుత్వం 2023-24లో 5.22 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే, తాము ఈ ఏడాది ఇప్పటికే 14 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. తాము నేరుగా 6.97 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని, వైసీపీ హయాంలో దళారులకే పెద్దపీట వేశారని ఆరోపించారు.

‘దీపం-2’ పథకం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మనోహర్ అన్నారు. తాము ఇచ్చిన హామీ మేరకు అర్హులైన 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు మూడు విడతల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఇందుకోసం రూ.2,406 కోట్లు ఖర్చు చేశామని లెక్కలతో సహా వివరించారు. తుపాన్ల సమయంలో ప్యాలెస్‌కే పరిమితమైన జగన్‌కు, క్షేత్రస్థాయిలో పర్యటించిన పవన్ కల్యాణ్‌కు ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరారు. వైసీపీ పాలనలో రైతులు పడిన ఇబ్బందులను ప్రజలు మర్చిపోలేదని, వాస్తవాలను గ్రహించి నిర్ణయం తీసుకోవాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు.
YS Jagan Mohan Reddy
Nadendla Manohar
Andhra Pradesh
Farmers
Chandrababu Naidu
Pawan Kalyan
Rice Procurement
Free Gas Cylinders
YSRCP
TDP

More Telugu News