Vladimir Putin: భారత్ లో పుతిన్ పర్యటన వేళ దుమారం రేపిన బ్లూమ్‌బెర్గ్ కథనం

PIB fact check Bloomberg report on India Russia submarine deal
  • రష్యాతో కొత్త అణు జలాంతర్గామి లీజు ఒప్పందం లేదన్న కేంద్రం
  • బ్లూమ్‌బెర్గ్ కథనాన్ని తప్పుబడుతూ పీఐబీ ఫ్యాక్ట్-చెక్
  • 2019లోనే ఒప్పందం జరిగిందని స్పష్టత
  • పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో తెరపైకి వచ్చిన వార్తలు
రష్యాతో 2 బిలియన్ డాలర్ల విలువైన అణు జలాంతర్గామిని లీజుకు తీసుకునేందుకు భారత్ కొత్త ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ కథనం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) గురువారం స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య కొత్తగా ఎలాంటి ఒప్పందం జరగలేదని తేల్చి చెప్పింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ఈ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా పీఐబీ ఫ్యాక్ట్-చెక్ పోస్ట్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్న జలాంతర్గామి లీజు ఒప్పందం దాదాపు ఆరేళ్ల క్రితం, అంటే 2019లోనే జరిగిందని వివరించింది. ఒప్పందం ప్రకారం, ఈ సబ్‌మెరైన్ 2028 నాటికి భారత్‌కు అందనుందని తెలిపింది.

భారత్, రష్యాల మధ్య 78 ఏళ్లుగా బలమైన, స్థిరమైన సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా రక్షణ భాగస్వామ్యం ఇరు దేశాల స్నేహంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపాయి. గతంలో కేవలం కొనుగోలుదారు-విక్రయదారు సంబంధం నుంచి ఇప్పుడు సంయుక్త పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి స్థాయికి ఈ బంధం ఎదిగిందని వివరించాయి. 

టీ-90 ట్యాంకులు, సు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్‌లోనే అసెంబుల్ అవుతున్నాయని, బ్రహ్మోస్ వంటి క్షిపణులను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయని గుర్తుచేశాయి. పుతిన్ పర్యటనలో వాణిజ్యం, రవాణా కారిడార్ల వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.
Vladimir Putin
India Russia relations
Russian submarine deal
PIB Fact Check
Defence partnership
Nuclear submarine
T-90 tanks
Su-30 MKI aircraft
BrahMos missile
Bloomberg news

More Telugu News