Kollu Ravindra: నాలుగు గోడల మధ్య మూడు గంటల ప్రెస్ మీట్ తో జగన్ సాధించిందేంటి?: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra Criticizes Jagans Press Meet What Did He Achieve
  • జగన్ ప్రెస్ మీట్ ఓ డ్రామా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
  • పిన్నెల్లి, జోగి రమేశ్ వంటి వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శలు
  • కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను పకడ్బందీగా అమలు చేస్తోందని వెల్లడి
  • సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టీకరణ
వైసీపీ అధినేత జగన్ ఇవాళ నిర్వహించిన సుదీర్ఘ మీడియా సమావేశంపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నాలుగు గోడల మధ్య మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి ఏం సాధించారు?" అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక, బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే జగన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. "ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నారు. అందరు జర్నలిస్టులను పిలిచి, వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకుంటున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నరరూప రాక్షసుడిని దేవతామూర్తిగా, జోగి రమేశ్ లాంటి వారిని గొప్ప వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? తిరుమల పరకామణిలో స్వామివారి హుండీ కొట్టేసిన వారిని వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు" అని మండిపడ్డారు.

మహిళలపై దాడులు చేసిన వారిని, గంజాయి సరఫరా చేసే వైసీపీ నాయకులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఛీ కొట్టినా జగన్‌కు సిగ్గురావడం లేదని, ఆయన నైజాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. "2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో అధికారం చేపట్టింది. వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకెళుతుంటే, సూపర్ సిక్స్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు" అని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. "64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. 'తల్లికి వందనం' ద్వారా 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశాం. 'అన్నదాత సుఖీభవ' రెండో విడత కింద రూ.6310 కోట్లు అందించాం. 'దీపం-2' పథకం ద్వారా రూ.2104 కోట్లతో 2.5 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం" అని తెలిపారు.

మహిళల కోసం 'స్త్రీ శక్తి' పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, 16,397 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నిర్వహించడం వంటివి తమ ప్రభుత్వ విజయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, తుఫాన్ నష్టానికి హెక్టార్‌కు రూ.25 వేలు అందిస్తున్నామని అన్నారు.

"ఇవన్నీ ప్యాలెస్‌లలో కూర్చుంటే కనిపించవు జగన్ రెడ్డీ. మద్యం ద్వారా రూ.3,500 కోట్లు అవినీతికి పాల్పడిన మీరు మద్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
Kollu Ravindra
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh Politics
Telugu Desam Party
TDP
AP Government
Chandrababu Naidu
Pawan Kalyan
YSRCP

More Telugu News