Malaria: ప్రపంచాన్ని వణికిస్తున్న మలేరియా... 2024లో 6.10 లక్షల మంది మృతి

Over 6 lakh lives lost due to malaria in 2024 drug resistance a major threat Says WHO
  • 2024లో ప్రపంచవ్యాప్తంగా 28.2 కోట్ల మలేరియా కేసులు
  • మలేరియా కారణంగా 6.10 లక్షల మంది మృతి.. వీరిలో అత్యధికులు చిన్నారులే
  • మందులకు లొంగని మలేరియా.. పెరుగుతున్న డ్రగ్ రెసిస్టెన్స్ పెనుసవాల్
  • ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులు, మరణాలు భారత్‌లోనేనని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా మలేరియా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. 2024లో దాదాపు 28.2 కోట్ల మంది మలేరియా బారిన పడగా, 6.10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈరోజు విడుదల చేసిన ఈ నివేదిక, మలేరియా నిర్మూలన ప్రయత్నాలకు డ్రగ్ రెసిస్టెన్స్ (మందులకు లొంగని తత్వం) పెద్ద ముప్పుగా పరిణమించిందని హెచ్చరించింది.

గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య 90 లక్షలు పెరిగింది. మరణాలలో 95 శాతం ఆఫ్రికా దేశాల్లోనే సంభవించగా, వీరిలో ఐదేళ్ల లోపు చిన్నారులే అధికంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక, ఆగ్నేయాసియా రీజియన్‌లో నమోదైన మొత్తం కేసులలో 73.3 శాతం మరణాలలో 88.7 శాతం భారత్‌లోనే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇది దేశంలో వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది.

మలేరియాపై పోరాటంలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, సవాళ్లు తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు వ్యాక్సిన్‌ల వాడకం ద్వారా 2024లో 17 కోట్ల కేసులను, 10 లక్షల మరణాలను నివారించగలిగారు. మరోవైపు, ఆఫ్రికాలోని 8 దేశాల్లో మలేరియా మందులు పనిచేయకపోవడం, 48 దేశాల్లో దోమలు కీటకనాశకాలను తట్టుకోవడం వంటివి సమస్యను జఠిలం చేస్తున్నాయి. వాతావరణ మార్పులు, నిధుల కొరత కూడా నిర్మూలన కార్యక్రమాలను దెబ్బతీస్తున్నాయి.

"మలేరియా నివారణకు కొత్త సాధనాలు మనకు ఆశ కల్పిస్తున్నాయి. కానీ, పెరుగుతున్న కేసులు, డ్రగ్ రెసిస్టెన్స్, నిధుల కోత వంటి సవాళ్లు మనం సాధించిన పురోగతిని వెనక్కి నెట్టే ప్రమాదం ఉంది. అయినా పటిష్ఠమైన నాయకత్వం, సరైన పెట్టుబడులతో మలేరియా రహిత ప్రపంచాన్ని సాధించడం సాధ్యమే" అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.
Malaria
World Health Organization
WHO
Malaria cases
Drug resistance
Africa malaria
India malaria
Malaria vaccine
Tedros Adhanom Ghebreyesus
Infectious disease

More Telugu News