Hyderabad Traffic Police: ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ ప్రచారం... నిజమేనా!

Hyderabad Traffic Police Denies Challan Discount Rumors
  • ఈ నెల 13న వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ లు
  • చలాన్లపై ఎలాంటి రాయితీ ప్రకటించలేదంటున్న పోలీసులు
  • ‘ఎక్స్’ లో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ వివరణ
  • ఫేక్ ప్రచారం నమ్మొద్దంటూ వాహనదారులకు విజ్ఞప్తి
ట్రాఫిక్ చలాన్లపై 50 నుంచి 100 శాతం రాయితీ అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టారు. ఎక్స్ వేదికగా ఈ ప్రచారంపై వివరణ ఇచ్చారు. ఈ నెల 13న లోక్ అదాలత్ లు జరుగుతున్న విషయం నిజమేనని, అయితే చలాన్లపై రాయితీ వార్తలు మాత్రం అబద్ధమని తెలిపారు. వాహనదారులు అనధికారిక ప్రకటనను నమ్మకూడదని... కేవలం పోలీస్ శాఖ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ మాత్రమే చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. ఫేక్ వార్తలు నమ్మొద్దని వాహనదారులకు సూచించారు.

లోక్ అదాలత్ లో చలాన్లపై రాయితీ..
వాహనదారులకు శుభవార్త, మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను లోక్ అదాలత్ లో రాయితీతో చెల్లించవచ్చునని ఆ వార్తల సారాంశం. ఈ నెల 13న ట్రాఫిక్ పోలీసులు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, లోక్ అదాలత్ కు హాజరై వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను 50 శాతం నుంచి 100 శాతం వరకు రాయితీతో చెల్లించవచ్చని ఆ ప్రచారంలో పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో అదే రోజున లోక్ అదాలత్ లు నిర్వహిస్తుండటంతో ఈ ప్రచారం నిజమేనని వాహనదారులు భావించారు. అయితే, ఈ ప్రచారం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ట్రాఫిక్ చలాన్లపై రాయితీకి సంబంధించి తమ శాఖ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు.
Hyderabad Traffic Police
Traffic Challan Discount
Hyderabad
Lok Adalat
Traffic Violations
Challan Discount
Telangana Traffic
Fake News
Traffic Rules

More Telugu News