కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన: సజ్జల

 Sajjala Ramakrishna Reddy Huge Response to Signature Campaign
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం
  • లక్ష్యం కంటే ఎక్కువ సంతకాలు వచ్చాయన్న సజ్జల
  • ఈ నెల 16న గవర్నర్‌కు సంతకాలను అందజేయనున్న జగన్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం' కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాలను లక్ష్యంగా పెట్టుకుంటే, అంతకుమించి వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఈ సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్నట్లు సజ్జల వెల్లడించారు. ఈ మేరకు కార్యక్రమ షెడ్యూల్‌ను నేతలకు వివరించారు. నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10వ తేదీలోగా జిల్లా పార్టీ కార్యాలయాలకు, అక్కడి నుంచి 13న తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు.

సంతకాలను పంపే ముందు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్రజలు, మీడియా ముందు ప్రదర్శించి, బాక్సుల్లో సర్ది పంపాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య నేతలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధినేత జగన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తరలించాలని చెప్పినట్టు సజ్జల పేర్కొన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని ఆయన కోరారు. 
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YSRCP
Medical Colleges Privatization
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Signature Campaign
Protest
Government Medical Colleges
Governor
Tadepalli

More Telugu News