కెనడాలో రోబోలా బతకలేను.. ఐదేళ్ల తర్వాత ఇండియాకు తిరిగొస్తున్నా: ఎన్నారై వైరల్ పోస్ట్

  • కెనడాలో ఐదేళ్లు గడిపిన ఎన్నారై ఇండియాకు తిరుగు పయనం 
  • విదేశాల్లో జీవితం రోబోలా, ఒంటరిగా అనిపించిందన్న యువకుడు
  • భారత్‌లోని గందరగోళమే బాగుందంటూ రెడ్డిట్‌లో పోస్ట్
  • ఎన్నారై ధైర్యమైన నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు
ఉత్తమ ఉద్యోగావకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణం. అయితే, కెరీర్‌లో ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత దేశానికి, ఆత్మీయులకు దూరంగా ఉండటం వల్ల కలిగే ఒంటరితనం చాలామందిని వేధిస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న ఓ ప్రవాస భారతీయుడు (ఎన్నారై) ఐదేళ్ల తర్వాత కెనడాను వదిలి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన ఆవేదనను పంచుకుంటూ పెట్టిన ఓ రెడ్డిట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"కెనడాలో ఐదేళ్లు ఉన్న తర్వాత నా వల్ల కాలేదు. ఇక్కడ నాకు స్నేహితులు ఉన్నప్పటికీ, సామాజిక ఒంటరితనం నన్ను కుంగదీసింది. విదేశాల్లో జీవితం ఒక రోబోలా అనిపించింది. ఆ ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించడం కష్టం" అని ఆ యువకుడు తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అక్కడి జీవనశైలి గురించి వివరిస్తూ.. "ప్రతీది ఒక పద్ధతి ప్రకారం, పక్కా ప్లాన్‌తో జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఈ అతి క్రమశిక్షణతో స్వేచ్ఛగా బతుకుతున్నానన్న భావనే పోయింది" అని తెలిపాడు.

భారత్‌లోని జీవన విధానాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని అతను చెప్పాడు. "భారత్‌లో ఉండే 'వ్యవస్థీకృత గందరగోళం' నాకు చాలా ఇష్టం. అనుకోకుండా జరిగే పరిచయాలు, అప్పటికప్పుడు వేసుకునే ప్లాన్‌లను చాలా మిస్ అయ్యాను. అందుకే ఇక ఇక్కడ ఉండలేనని నిర్ణయించుకున్నా" అని వివరించాడు. "భారత్‌లో శుభ్రత, పౌర స్పృహ తక్కువని విమర్శలు ఉండొచ్చు. కానీ ఎన్ని లోపాలున్నా నాకిదే ఇష్టం. ఎందుకంటే ఇది నా ఇల్లు" అని పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతడి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. "ధైర్యమైన నిర్ణయం తీసుకున్నావు, నీ మనసు చెప్పింది వినడం మంచిది" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతి ప్రదేశానికి దాని లాభనష్టాలు ఉంటాయని, మనకు సంతోషాన్నిచ్చే చోట ఉండటమే ముఖ్యమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన విదేశాల్లో స్థిరపడిన చాలామంది భారతీయులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు అద్దం పడుతోంది.


More Telugu News