Murali Govindaraj: నిర్మాణంలో ఉన్న ఇంట్లోనే టెక్కీ బలవన్మరణం.. పక్కింటి వారి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్ !

Bangalore Techie Suicide Neighbors Extortion Blamed in Suicide Note
  • రూ. 20 లక్షలు డిమాండ్ చేశారంటూ టెక్కీ సూసైడ్ నోట్
  • ఇద్దరు పొరుగువారిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • అధికారుల నోటీసులతో తీవ్ర ఒత్తిడికి గురైన బాధితుడు
పొరుగువారి వేధింపులు, అధికారుల ఒత్తిడి, రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులు.. ఈ మూడూ కలిసి ఓ టెక్కీని బలితీసుకున్నాయి. తాను కట్టుకుంటున్న ఇంట్లోనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) అధికారుల ముందు హాజరుకావడానికి కొన్ని గంటల ముందే ఈ దారుణం జరిగింది.

వైట్‌ఫీల్డ్‌లోని నల్లూరహళ్లికి చెందిన మురళీ గోవిందరాజు (45) ఐటీపీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం, తను నిర్మించుకుంటున్న ఇంటి రెండో అంతస్తులో ఆయన ఉరి వేసుకుని కనిపించారు. ఘటనా స్థలంలో 10 పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు పక్కింట్లో ఉండే కుటుంబం, కొందరు అధికారులు కారణమని అందులో పేర్కొన్నారు.

మురళీని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆయన పొరుగువారైన శశి నంబియార్ (64), ఉష (57) దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వారి కుమారుడు వరుణ్ కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. మురళి 2018లో ఈ స్థలం కొన్నారు. ఇల్లు కట్టడం ప్రారంభించినప్పటి నుంచి పక్కింటి వారైన శశి, ఉష.. నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పదేపదే ఆరోపించడం మొదలుపెట్టారు. వేధింపులు ఆపాలంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని మురళి తల్లి లక్ష్మీ గోవిందరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు పెట్టిన గడువు బుధవారమేనని తన కుమారుడు చెప్పినట్లు ఆమె తెలిపారు.

ఈ వివాదంపై ఉష జీబీఏ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు మురళికి నోటీసులు జారీ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ ఒత్తిడి తట్టుకోలేకే మురళి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేశారు. యాక్టివిజం పేరుతో ఈ దంపతులు చాలా మందిని ఇలాగే వేధించి డబ్బు వసూలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారని, బాధితులుంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.
Murali Govindaraj
Bangalore techie suicide
neighbor harassment
ITPL employee
Greater Bangalore Authority
GBA officials
suicide note
extortion
Whitefield
Nallurahalli

More Telugu News