Ayatollah Ali Khamenei: హిజాబ్ వివాదం: పాశ్చాత్య సంస్కృతిపై ఖొమేనీ సంచలన వ్యాఖ్యలు

Khamenei defends Hijab Law criticizes Western values
  • హిజాబ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకున్న ఇరాన్ అధినేత ఖొమేనీ
  • పశ్చిమ దేశాలు మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నాయని విమర్శ
  • అమెరికాలో కుటుంబ వ్యవస్థ నాశనమైందంటూ వ్యాఖ్యలు
  • ఇస్లాంలో మహిళలకు అత్యున్నత గౌరవం ఉందని వెల్లడి
ఇరాన్ అత్యున్నత నేత అయాతుల్లా అలీ ఖొమేనీ మరోసారి హిజాబ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాలు సహా అమెరికాలోని పెట్టుబడిదారీ విధానం మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దేశంలో మహిళలు హిజాబ్ నిబంధనలను బహిరంగంగా ధిక్కరిస్తున్న తరుణంలో, ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పాశ్చాత్య దేశాల్లో మహిళలను ఒక వస్తువుగా చూస్తూ, వారి ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్నారని ఖొమేనీ విమర్శించారు. "మహిళల భద్రత, గౌరవం, మర్యాదను కాపాడటమే వారి హక్కులలో ప్రధానమైనది. దుష్ట పెట్టుబడిదారీ తర్కం మహిళల గౌరవాన్ని నాశనం చేస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ దేశాల్లో మహిళలు దోపిడీకి గురవుతున్నారని, సమాన పనికి పురుషుల కన్నా తక్కువ వేతనం పొందుతున్నారని ఆరోపించారు.

అమెరికా సంస్కృతిపై విరుచుకుపడిన ఖొమేనీ, అక్కడ కుటుంబ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని అన్నారు. "తండ్రిలేని పిల్లలు, క్షీణిస్తున్న కుటుంబ సంబంధాలు, యువతులపై ముఠాల దాడులు, స్వేచ్ఛ పేరుతో పెరిగిపోతున్న లైంగిక విశృంఖలత్వం.. ఇదీ పశ్చిమ దేశాల్లో కుటుంబాల పరిస్థితి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇస్లాంలో మహిళలకు స్వాతంత్ర్యం, గుర్తింపు, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయని ఆయన వివరించారు. "ఇస్లాం దృష్టిలో మహిళ ఇంటికి ఒక పువ్వు లాంటిది. ఆమెను సేవకురాలిగా కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి" అని తెలిపారు.

అయితే, ఖొమేనీ వాదనలకు, ఇరాన్‌లోని వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఏడేళ్ల వయసు నుంచే హిజాబ్ తప్పనిసరి చేయడం, బాల్య వివాహాలు, గృహ హింస నుంచి చట్టపరమైన రక్షణ లేకపోవడం వంటి తీవ్రమైన వివక్షను ఇరాన్‌లో మహిళలు ఎదుర్కొంటున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Ayatollah Ali Khamenei
Iran hijab law
Western culture
women's rights
Islamic views
gender equality
Khomeini comments
social media
family values
Iranian women

More Telugu News