Pakistan International Airlines: తీవ్ర ఆర్థిక సంక్షోభం.. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం!

Pakistan International Airlines Up for Sale Amid Economic Crisis
  • ఐఎంఎఫ్ షరతులతో పీఐఏ ప్రైవేటీకరణకు పాక్ నిర్ణయం
  • 23న జరగనున్న బిడ్డింగ్ ప్రక్రియ
  • బిడ్డింగ్ రేసులో పాక్ సైన్యం నియంత్రణలోని కంపెనీ
  • నకిలీ పైలట్ల కుంభకోణం, అవినీతితో కూలిపోయిన పీఐఏ
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడితో కీలక నిర్ణయం తీసుకుంది. తన జాతీయ విమానయాన సంస్థ 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్' (పీఐఏ)ను ప్రైవేటీకరించేందుకు సిద్ధమైంది. ఈ విమానయాన సంస్థలో 51 శాతం నుంచి 100 శాతం వాటాల అమ్మకానికి ఈ నెల 23న బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం స్పష్టం చేశారు.

ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ పొందేందుకు పీఐఏ ప్రైవేటీకరణ అనేది ఒక ప్రధాన షరతు. గత రెండు దశాబ్దాల్లో పాకిస్థాన్‌లో జరుగుతున్న అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియ ఇదే కావడం గమనార్హం. ఈ బిడ్డింగ్ కోసం నాలుగు కంపెనీలు అర్హత సాధించాయి. వాటిలో లక్కీ సిమెంట్ కన్సార్షియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్షియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్‌తో పాటు పాక్ సైన్యం నియంత్రణలో ఉండే 'ఫౌజీ ఫౌండేషన్'కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉండటం చర్చనీయాంశమైంది. 

సంవత్సరాలుగా ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ నియామకాలతో పీఐఏ భారీ నష్టాల్లో మునిగిపోయింది. 2020లో 30 శాతం మంది పైలట్లు నకిలీ లైసెన్సులతో విమానాలు నడుపుతున్నారనే కుంభకోణం బయటపడటంతో సంస్థ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా యూరప్, అమెరికా, యూకే వంటి దేశాలు పీఐఏ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో సంస్థ ఆర్థికంగా మరింత కుదేలైంది. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్న పాకిస్థాన్, ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి పెట్టింది.
Pakistan International Airlines
PIA Privatization
Pakistan Economic Crisis
IMF Pakistan
Shehbaz Sharif
Lucky Cement Consortium
Fauji Foundation
Pakistan Aviation
Fake Pilot Licenses

More Telugu News