Virat Kohli: సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli Breaks Sachin Tendulkars Record in ODI
  • సౌతాఫ్రికాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ
  • వన్డేల్లో 53వ శతకాన్ని నమోదు చేసిన కింగ్ కోహ్లీ
  • 150+ పరుగుల భాగస్వామ్యాల్లో కోహ్లీ సరికొత్త రికార్డు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో మెరిసిన కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా అతనికి ఇది 84వ అంతర్జాతీయ శతకం. మొత్తం 93 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు.

యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సార్లు (32 సార్లు) 150 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (31) పేరిట ఉండేది.

కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. చివర్లో కేఎల్ రాహుల్ 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. 
Virat Kohli
Sachin Tendulkar
India vs South Africa
Ruturaj Gaikwad
ODI Record
Cricket
Century
Partnership Record
KL Rahul
Indian Cricket Team

More Telugu News