Alima Khan: భారత్‌తో యుద్ధానికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

Imran Khan Sister Alima Khan Alleges Pak Army Chief Wants War With India
  • ఇమ్రాన్ ఖాన్ మాత్రం భారత్‌తో స్నేహం కోరుకుంటున్నారని ఆయన సోదరి వివరణ 
  • ఆసిమ్ మునీర్ ఒక ఛాందసవాద ఇస్లామిస్ట్ అంటూ అలీమా ఖాన్ వ్యాఖ్య
  • జైల్లో ఇమ్రాన్‌ను మానసికంగా హింసిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆందోళన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధం చేయాలని తహతహలాడుతుంటే, తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ మాత్రం పొరుగు దేశంతో స్నేహాన్ని కోరుకుంటారని ఆమె అన్నారు. ‘స్కై న్యూస్’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఆసిమ్ మునీర్ ఛాందసవాద ఇస్లామిస్ట్. అందుకే ఇస్లాంను విశ్వసించని వారితో యుద్ధం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి భారత్‌తో, చివరికి బీజేపీతో కూడా స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ, మునీర్ లాంటి వ్యక్తి ఉన్నప్పుడు భారత్‌తో యుద్ధం తప్పదు" అని అలీమా స్పష్టం చేశారు. ఈ ఏడాది మే నెలలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఆయన భార్య బుష్రా బీబీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు అప్పటి ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న మునీర్ ఆసక్తి చూపారు. దీంతో ఆగ్రహించిన ఇమ్రాన్, మునీర్‌ను ఎనిమిది నెలల్లోనే ఆ పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి రావల్పిండిలోని అదియాలా జైల్లో ఉన్నారు. ఇటీవల ఆయన మరో సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ జైల్లో కలిసి, తన సోదరుడిని మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. తన దుస్థితికి ఆసిమ్ మునీరే కారణమని ఇమ్రాన్ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. ప్రభుత్వం భయంతోనే ఇమ్రాన్‌ను ఏకాకిని చేసి, ప్రజల గొంతు నొక్కాలని చూస్తోందని అలీమా విమర్శించారు. తన సోదరుడి విడుదలకు పశ్చిమ దేశాలు చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Alima Khan
Asim Munir
Imran Khan
Pakistan
India
Pak Army Chief
ISI
Bushra Bibi
Operation Sindoor
Terrorist Camps

More Telugu News