Imran Khan: నా దుస్థితికి ఆర్మీ చీఫే కారణం: సోదరితో ఇమ్రాన్‌ఖాన్

Imran Khan Blames Army Chief for His Plight Sister Claims
  • ఇమ్రాన్‌ఖాన్ మృతి వదంతులకు చెక్
  • 25 రోజుల తర్వాత సోదరితో భేటీ
  • జైలులో తనను మానసికంగా హింసిస్తున్నారన్న మాజీ ప్రధాని
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్.. దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను అక్రమంగా జైల్లో నిర్బంధించడానికి, తన ప్రస్తుత దుస్థితికి ఆయనే పూర్తి కారణమని ఇమ్రాన్ ఆరోపించారు. మంగళవారం రావల్పిండిలోని అడియాలా జైల్లో తన సోదరి డాక్టర్ ఉజ్మా ఖానమ్‌తో జరిగిన 20 నిమిషాల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీతో గత కొన్ని వారాలుగా ఆయన మృతిపై వ్యాపిస్తున్న వదంతులకు తెరపడింది.

దాదాపు 25 రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో ఇమ్రాన్‌కు ఇదే తొలి భేటీ. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఉజ్మా, తన సోదరుడు ప్రాణాలతోనే ఉన్నారని, అయితే తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. "'అల్లా దయవల్ల ఆయన ప్రాణాలతో, మంచి ఆరోగ్యంతోనే ఉన్నారు. కానీ తనను మానసికంగా హింసిస్తున్నారని, ఏకాంత నిర్బంధంలో ఉంచారని తీవ్ర ఆవేదనతో చెప్పారు. రోజులో కొద్దిసేపు తప్ప మిగతా సమయమంతా సెల్‌లోనే బంధిస్తున్నారు' అని ఉజ్మా వెల్లడించారు.

గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తీవ్రమైన ప్రచారం జరిగింది. కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసేందుకు జైలు అధికారులు అనుమతించకపోవడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరింది. దీంతో పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు ఇస్లామాబాద్, రావల్పిండిలలో నిరసనలకు దిగారు.

ఇమ్రాన్ ఖాన్ అసాధారణ ప్రజాదరణకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం భయపడుతోందని పీటీఐ ఆరోపిస్తోంది. ఆయనను మానసికంగా దెబ్బతీసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి చేసేందుకే ఈ కుట్ర జరుగుతోందని పార్టీ సెనేటర్ ఖుర్రం జీషన్ విమర్శించారు. ప్రపంచకప్ విజేత కెప్టెన్, 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. తోషాఖానా సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో 2023 ఆగస్టు నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
Imran Khan
Asim Munir
Pakistan
Tehreek-e-Insaf
PTI
Uzma Khan
Rawalpindi
Adiala Jail
Pakistan Army
Shehbaz Sharif

More Telugu News