హైదరాబాద్‌ మధ్యలో మరో భారీ ఎక్స్‌ప్రెస్‌ వే.. ట్రాఫిక్‌కు చెక్!

  • కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం
  • బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు 10 కిలోమీటర్ల మార్గం
  • ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే ప్రధాన లక్ష్యం
  • పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో ఆరు లేన్ల రహదారి నిర్మాణం
  • సీఎం ఆదేశాలతో సర్వే ప్రారంభించిన కన్సల్టెన్సీ బృందం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)కు వేగంగా చేరుకునేలా కొత్త ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల రహదారిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ను ఆదేశించింది.

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీతో ప్రధాన రహదారులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, కేబీఆర్ పార్కు పరిసరాలు, పాత ముంబై రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో, బంజారాహిల్స్ నుంచి ఫిలింనగర్‌, జడ్జిస్‌ కాలనీ, దుర్గంచెరువు, టీ-హబ్‌ మీదుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ వరకు ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించనున్నారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించిన పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలోనే దీన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 6-7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి, అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఇప్పటికే ఓ కన్సల్టెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ బృందం ప్రతిపాదిత మార్గంలో క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తోంది. సర్వే పూర్తయిన వెంటనే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓఆర్‌ఆర్‌ నుంచి నగరంలోకి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.


More Telugu News