Amardeep Kumar: హైదరాబాదులో భారీ స్కాం... నిందితుడి విమానాన్ని వేలం వేయనున్న ఈడీ

ED Auctions Amardeep Kumars Plane in Falcon Group Scam
  • రూ.792 కోట్ల ఫాల్కన్ గ్రూప్ స్కామ్‌లో ఈడీ కీలక చర్యలు
  • నిందితుడు అమర్‌దీప్ కుమార్ విమానాన్ని వేలానికి సిద్ధం
  • డిసెంబర్ 9న ఆన్‌లైన్‌లో జరగనున్న వేలం పాట
  • వేలం ద్వారా వచ్చే డబ్బు బాధితులకు చెల్లిస్తామని వెల్లడి
  • ఇదే విమానంలో దేశం విడిచి పారిపోయిన ప్రధాన నిందితుడు
భారీ మొత్తంలో ఇన్వెస్టర్లను మోసం చేసిన ఫాల్కన్ గ్రూప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. సుమారు రూ.792 కోట్ల ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్‌లో ప్రధాన నిందితుడైన అమర్‌దీప్ కుమార్ కంపెనీకి చెందిన హాకర్ 800ఏ ప్రైవేట్ విమానాన్ని వేలం వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని స్కామ్ బాధితులకు నష్టపరిహారంగా చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.

ఈడీ కథనం ప్రకారం, ఫాల్కన్ గ్రూప్ పేరుతో అమర్‌దీప్ కుమార్ నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పథకాన్ని ప్రారంభించి, అనేక మంది నుంచి రూ.792 కోట్లు వసూలు చేసి మోసం చేశాడు. ఈ కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం 2025 ఫిబ్రవరి 11న మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా, వాటి ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడానికి ముందే అమర్‌దీప్ కుమార్ ఇదే విమానంలో దేశం విడిచి పారిపోయినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

ఈ కేసులో భాగంగా ఈడీ 2025 మార్చి 7న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఈ విమానం బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉంది. డిసెంబర్ 9న ఎంఎస్టీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ వేలం జరగనుంది. ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 7 వరకు ఈ విమానాన్ని పరిశీలించవచ్చని ఈడీ తెలిపింది.

ఈ కేసులో ఇప్పటికే అమర్‌దీప్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, కంపెనీ సీఓఓ ఆర్యన్ సింగ్ ఛాబ్రాలను ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే, రూ.18.63 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. విమానం నిర్వహణ ఖర్చులు దాని విలువను మించిపోయే అవకాశం ఉన్నందున, దానిని వేలం వేయడానికి పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ నవంబర్ 20న అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
Amardeep Kumar
Falcon Group
ED
Enforcement Directorate
Invoice Discounting Scam
Hyderabad Scam
Hawker 800A
Money Laundering
Cyberabad Economic Offences Wing
MSTC

More Telugu News