Chandrababu Naidu: త్వరలోనే ఆర్టీసీకి 1000 ఈవీ బస్సులు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces 1000 EV Buses for RTC Soon
  • విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం
  • వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తిదారుగా మారే విధానాలకు ప్రోత్సాహం
  • గత ప్రభుత్వ పీపీఏల రద్దుతో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం పడిందన్న సీఎం
రాష్ట్రంలో పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించేందుకు ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాబోయే ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులన్నింటినీ ఈవీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. దీనికి అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. 

మంగళవారం నాడు సచివాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు రూ.1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కీలకమైన ఈ పరిశ్రమలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. 

రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు జెన్‌కో, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. 

60 రోజుల్లోనే పనులు ప్రారంభం కావాలి

రాష్ట్రాన్ని ఒక 'న్యూ ఎనర్జీ హబ్'గా మార్చాలని ఆకాంక్షించిన చంద్రబాబు, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ఐస్) పాలసీ కింద ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు 60 రోజుల్లోనే తమ పనులను ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో 'పవర్ స్వాపింగ్' ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. 

గత ప్రభుత్వ నిర్ణయాలతో రూ.9 వేల కోట్ల భారం

గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రద్దు నిర్ణయంతో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం పడిందని, విద్యుత్‌ను వినియోగించుకోకుండానే కంపెనీలకు ఆ ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సమర్ధ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ఆ భారాన్ని సున్నాకు తగ్గించగలిగామని వివరించారు. 

ఈ సమీక్షలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె.విజయానంద్, ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల సీఎండీలు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP RTC
Electric Buses
EV Buses
Ferro Alloys
Power Sector
Clean Energy
Solar Power
Free Electricity

More Telugu News