పార్టీ బలోపేతమే లక్ష్యం.. టీడీపీ ఎంపీపీలకు శిక్షణ పూర్తి

  • మంగళగిరిలో టీడీపీ ఎంపీపీల రెండ్రోజుల శిక్షణ విజయవంతం
  • సూపర్ సిక్స్, సోషల్ మీడియా వినియోగంపై నేతలకు అవగాహన
  • సోమిరెడ్డి, కూన రవికుమార్ తదితర సీనియర్ నేతల శిక్షణ
  • వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రత్యేక సెషన్
తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీల శిక్షణా తరగతులు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది.

శిక్షణలో భాగంగా రెండో రోజు పలు కీలక అంశాలపై పార్టీ సీనియర్ నేతలు ఎంపీపీలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'సూపర్ సిక్స్' పథకాల అమలు, కార్యకర్తలకు పార్టీ అందిస్తున్న బీమా, సాధికారత, సోషల్ మీడియా, టెక్నాలజీ, 'మై టీడీపీ' యాప్ వినియోగం వంటి అంశాలపై ఎమ్మెల్యేలు కూన రవికుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాధవి రెడ్డి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తదితరులు అవగాహన కల్పించారు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషన్‌లో వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోత్స్న మండల స్థాయి నాయకులకు వివరించారు. ఈ శిక్షణా తరగతుల్లో మంత్రులు, మాజీ మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, పలువురు సీనియర్ నేతలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ.. క్యాడర్ నుంచి నాయకులుగా ఎదిగేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, వారి విశ్వసనీయతను పొందాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేసి, పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండేలా చూడటమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News