Renuka Chowdhury: పాపం ఆ కుక్క ఏం చేసింది?.. రేణుకా చౌదరికి అండగా నిలిచిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Supports Renuka Chowdhury Dog Controversy
  • పార్లమెంటుకు వీధికుక్కను తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి
  • ఆమె చర్యను సమర్థించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  • లోపల ఉన్నవాళ్లు కరుస్తారు కానీ కుక్కలు కాదంటూ రేణుక ఘాటు వ్యాఖ్యలు
  • ఇది ప్రజాస్వామ్య దేవాలయాన్ని అపహాస్యం చేయడమేనన్న బీజేపీ
కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటు ప్రాంగణానికి ఓ కుక్కను తీసుకురావడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో ఆమెకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది.

మంగళవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఈ వివాదంపై స్పందించారు. "పాపం ఆ కుక్క ఏం చేసింది? వాటిని ఇక్కడికి రానివ్వరా?" అని ప్రశ్నించారు. "ఈ రోజుల్లో దేశంలో ఇలాంటి అంశాలే ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి" అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్లమెంటులోకి పెంపుడు జంతువులకు అనుమతి లేదని అధికారులు చెప్పగా, "వాటికి అనుమతి ఉంది" అని ఆయన బదులిచ్చారు.

సోమవారం నాడు శీతాకాల సమావేశాల సందర్భంగా రేణుకా చౌదరి తాను కాపాడిన ఓ వీధికుక్కను కారులో పార్లమెంటుకు తీసుకొచ్చారు. పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారని కొందరు ప్రశ్నించగా, ఆమె ఘాటుగా బదులిచ్చారు. "ఈ ప్రభుత్వానికి జంతువులంటే ఇష్టం లేదు. లోపల కూర్చున్న వాళ్లే కరుస్తారు కానీ, కుక్కలు కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

రేణుక చర్యను, ఆమెకు రాహుల్ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ప్రజాస్వామ్య దేవాలయాన్ని అపహాస్యం చేయడమేనని బీజేపీ నేతలు విమర్శించారు. ఎంపీలను కుక్కలతో పోల్చిన సొంత పార్టీ నేతను ఖండించకుండా, రాహుల్ ఆమెను వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ఈ ఘటనతో పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
Renuka Chowdhury
Rahul Gandhi
Congress
Rajya Sabha
Parliament
Street Dog
BJP
Political Controversy
Winter Session

More Telugu News