Kamal Haasan: రాజ్యసభ సభ్యత్వంపై కమల్ హాసన్ భావోద్వేగ స్పందన

Kamal Haasan Emotional Response to Rajya Sabha Membership
  • 71 ఏళ్లకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లుందన్న కమల్ హాసన్
  • ఎంపీగా సంతకం చేశాక తల్లిదండ్రులు గుర్తొచ్చారని వెల్లడి
  • తనను తాను మధ్యేవాదిగా అభివర్ణించుకున్న నటుడు
మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ పదవి తనకు 71 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినంత సంతోషాన్ని ఇచ్చిందని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ అనుభవాన్ని పంచుకున్నారు.

పెద్దల సభకు ఎంపీగా ఎన్నికైనప్పుడు మీ అనుభూతి ఏంటని ఓ వ్యక్తి ప్రశ్నించగా, కమల్ బదులిస్తూ ఆ క్షణంలో తన తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్, రాజ్యలక్ష్మి గుర్తుకువచ్చారని తెలిపారు. "నేనొక స్కూల్ డ్రాపౌట్. కనీసం ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసై ఉంటే రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడు ఎంపీగా సంతకం చేశాక, నా తల్లికి ఫోన్ చేసి నాకు ప్రభుత్వ కొలువు వచ్చిందని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది" అని కమల్ వివరించారు.

ఇదే కార్యక్రమంలో తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ, తనను తాను ఒక మధ్యేవాదిగా అభివర్ణించుకున్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కూడా తన సైద్ధాంతిక విశ్వాసాలకు అనుగుణంగానే పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే, కమల్ హాసన్ చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రంలో కనిపించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 
Kamal Haasan
Rajya Sabha
Makkal Needhi Maiam
MNM
Raj Kamal Films International
Thug Life Movie
Indian Actor
Politics
Kerala
D Srinivasan Iyengar

More Telugu News