DK Shivakumar: సిద్ధరామయ్యతో కలిసి సరదాగా బ్రేక్ ఫాస్ట్ చేశాను: డీకే శివకుమార్

DK Shivakumar Says Congress United Always Runs Government Together
  • ఎమ్మెల్యేలలో విభేదాలు లేవు, మీడియానే సృష్టిస్తోందని డీకే శివకుమార్ విమర్శలు
  • ప్రతిపక్షాలను ఐక్యంగా ఎదుర్కొంటామన్న సిద్ధరామయ్య
  • ఇద్దరం కలిసి ముందుకు సాగుతున్నామన సిద్ధరామయ్య
కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అసెంబ్లీ సమావేశాల వరకు పరిమితం కాదని, అది ఎల్లప్పుడూ ఉంటుందని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలలో ఎలాంటి విభేదాలు లేవని, మీడియానే విభేదాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. "అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు మాత్రమే మీ పార్టీలో ఐక్యత ఉంటుందా" అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, డీకే శివకుమార్ ఈ విధంగా సమాధానమిచ్చారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడారు.

తమ ఎమ్మెల్యేలందరూ ఐక్యంగానే ఉన్నారని, ప్రతిపక్షాలను ఐక్యంగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పష్టం చేశారు. తమ మధ్య ఐక్యత ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు. తాను, శివకుమార్ కలిసి ముందుకు సాగుతున్నామని, కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

సిద్ధరామయ్యతో కలిసి సరదాగా బ్రేక్‌ఫాస్ట్ చేశానని, అదే సమయంలో ఢిల్లీకి వెళ్లే అంశంపై తమ మధ్య చర్చ జరిగిందని డీకేశివకుమార్ వెల్లడించారు. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించినట్లు చెప్పారు. డిసెంబర్ 8న ఢిల్లీకి వెళ్లి అదే రోజు తిరిగి రావాలని దాదాపు నిర్ణయించుకున్నామని అన్నారు. పార్టీ ఎంపీలకు బాధ్యతలు కూడా అప్పగించవలసి ఉందని అన్నారు.

కావేరీ జలాలపై తీర్పు, రాష్ట్రానికి నిధులు సహా వివిధ పెండింగ్ పనులకు సంబంధించి ఎంపీలకు బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. కొన్ని అంశాలపై ప్రతిపక్ష నాయకులను కూడా ఢిల్లీకి తీసుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలుస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, వారు మొదట తమని ఆహ్వానించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

సిద్ధరామయ్యను మొదట తాను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించానని, ప్రతిగా ఆయన కూడా తనను ఆహ్వానించడంతో ఆయన ఇంటికి వెళ్లానని చెప్పారు. ఇప్పుడు తన ఇంటికి బ్రేక్‌ఫాస్ట్ కోసం వచ్చాడని వెల్లడించారు. సిద్ధరామయ్య కోసం మైసూరు తరహా వంటకాలు సిద్ధం చేశామని అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్యలో జోక్యం చేసుకుని, శివకుమార్ భార్య మైసూరుకు చెందినవారేనని గుర్తు చేశారు.

బ్రేక్‌ఫాస్ట్ సమయంలో రాజకీయాలు కూడా చర్చించామని, నాలుగు ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రకటన చేయాల్సి ఉందని అన్నారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ కర్ణాటక రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాతో మాట్లాడామని, ఒక సీటు విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. అధిష్ఠానానికి జాబితాను పంపించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే వ్యూహాలపై కూడా చర్చించామని అన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెబుతామని అన్నారు.
DK Shivakumar
Siddaramaiah
Karnataka Politics
Congress Party
Cauvery Water
Karnataka Government

More Telugu News