Siddaramaiah: మేమిద్దరం అన్నదమ్ముల్లాంటి వాళ్లం: సీఎం సిద్ధరామయ్య

We are like brothers Shivakumar will become CM when high command decides says Siddaramaiah after breakfast meeting
  • డీకే శివకుమార్ ఇంట్లో సీఎం సిద్ధరామయ్య అల్పాహార విందు భేటీ
  • తామిద్దరం కలిసే ఉన్నామని స్పష్టం చేసిన ఇరువురు నేతలు
  • సీఎం మార్పుపై అధిష్ఠానం, రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని వెల్లడి
  • అసెంబ్లీ సమావేశాలు, బీజేపీ వ్యూహాలపై చర్చించినట్లు ప్రకటన
కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తి రేపిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అల్పాహార విందు భేటీ ఇవాళ‌ ఉదయం ముగిసింది. బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న శివకుమార్ నివాసంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు తాము ఐక్యంగా ఉన్నామని, కలిసికట్టుగా పనిచేస్తామని వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి మార్పు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, రాహుల్ గాంధీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం సిద్ధరామయ్య.. "తాను, శివకుమార్ అన్నదమ్ముల్లాంటి వాళ్లం. పార్టీ కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తాం. శివకుమార్ ఎప్పుడు సీఎం అవుతారని కొందరు అడుగుతున్నారు. అధిష్ఠానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే అవుతారు" అని బదులిచ్చారు. ఈ నెల‌ 8 నుంచి జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతోందని, ఆ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వివరించారు.

సిద్ధరామయ్య కోసం ప్రత్యేకంగా నాటు కోడి వంటకాలు
ఈ అల్పాహార విందు భేటీలో ఆహారం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిద్ధరామయ్య కోసం ప్రత్యేకంగా ఇడ్లీ, ఆయన ఇష్టపడే 'నాటు కోడి పులుసు' సిద్ధం చేశారు. తాను మాంసాహారినని, శివకుమార్ శాకాహారి అని సిద్ధరామయ్య సరదాగా వ్యాఖ్యానించారు. "అసలైన నాటు కోడి ఇక్కడ దొరకదని, ఊరి నుంచి మంచి కోడిని తెప్పించమని శివకుమార్‌ను అడిగాను" అని ఆయన చెప్పడం నవ్వులు పూయించింది. శాకాహారి అయిన శివకుమార్ ఇడ్లీ, సాంబార్‌తో సరిపెట్టుకున్నారు.

ఈ సమావేశంలో శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్, ఎమ్మెల్యే హెచ్.డి. రంగనాథ్ కూడా పాల్గొన్నారు. సిద్ధరామయ్యకు డీకే సోదరులు ఘనస్వాగతం పలికారు. సురేశ్, రంగనాథ్ ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ భేటీ ద్వారా తాము ఐక్యంగా ఉన్నామనే బలమైన సందేశాన్ని పార్టీ శ్రేణులకు పంపినట్లయింది.
Siddaramaiah
DK Shivakumar
Karnataka politics
Congress party
Karnataka CM
Karnataka government
DK Suresh
Assembly elections
Political news
Breakfast meeting

More Telugu News