YS Jagan: జగన్ ఐదేళ్ల పాలనలో విమానయాన ఖర్చులు... రూ.222 కోట్లు!

YS Jagan Government Spent Rs 222 Crore on Aviation in Five Years
  • గగన విహారానికి జగన్ సర్కార్ భారీ వ్యయం
  • కోవిడ్ లాక్‌డౌన్‌లోనూ భారీగా కొనసాగిన వ్యయం
  • హెలికాప్టర్ చార్జీల కోసమే రూ.87 కోట్ల చెల్లింపు
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏసీఎల్) ద్వారా ఏకంగా రూ.222.85 కోట్లు వెచ్చించినట్లు తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం.

ఏడాది వారీగా ఖర్చులు:
2019-20: రూ.31.43 కోట్లు
2020-21: రూ.44 కోట్లు
2021-22: రూ.49.45 కోట్లు
2022-23: రూ.47.18 కోట్లు
2023-24: రూ.50.81 కోట్లు

మొత్తం ఐదేళ్ల ఖర్చును పరిశీలిస్తే... విమానాల చార్జీలకు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ చార్జీలకు రూ.87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రూ.23.31 కోట్లు చెల్లించారు. హెలికాప్టర్ చార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు రికార్డుల్లో ఉంది.
ఈ గణాంకాలు బయటకు రావడంతో అధికార తెలుగుదేశం పార్టీ, గత ప్రభుత్వ తీరును ఎండగడుతోంది. మంత్రి నారా లోకేశ్ పర్యటన ఖర్చులతో పోలుస్తూ టీడీపీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. "18 నెలలు మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ తన హెలికాప్టర్/ప్రత్యేక విమాన ప్రయాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ, 60 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రూ.222 కోట్లు ఖర్చు చేశారు" అని టీడీపీ ఆరోపించింది.

మరోవైపు, సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంలో... మంత్రి నారా లోకేశ్ తన హైదరాబాద్ ప్రయాణాలకు సంబంధించిన 77 విమాన టికెట్ల ఖర్చును పూర్తిగా సొంతంగానే భరించారని, ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడలేదని స్పష్టమైంది. 
YS Jagan
Jagan Mohan Reddy
AP Aviation Corporation
Andhra Pradesh
Nara Lokesh
TDP
GMR Aviation
Helicopter charges
Aviation expenses
APACL

More Telugu News