Sanchar Saathi App: మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్.. నిఘా కోసమేనని ప్రతిపక్షాల ఆరోపణ

Opposition Alleges Sanchar Saathi App is for Surveillance
  • ప్రభుత్వ యాప్ తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలనడంపై విమర్శలు
  • ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • సైబర్ నేరాలను అరికట్టేందుకేనని ప్రభుత్వం వివరణ
భారతదేశంలో తయారైనదైనా లేక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదైనా సరే.. దేశంలోని ప్రతీ మొబైల్ ఫోన్ లోను సంచార్ సాథీ యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. తొలగించడానికి వీలులేకుండా ఇన్ స్టాల్ చేయాలని సూచించింది. దీని కోసం ప్రభుత్వం 90 రోజులు గడువు కూడా విధించింది. మొబైల్ వినియోగదారులను సైబర్ మోసాల బారి నుంచి రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. ప్రజలపై నిఘా పెట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కేంద్రం వివరణ..
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, మోసగాళ్లు ఫిషింగ్ మెయిల్స్, మెసేజులు, ఏపీకే ఫైల్స్ పంపిస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాట్సాప్, మెసేజ్, ఫోన్ కాల్స్.. ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వివరించాయి. స్పామ్ కాల్స్, మెసేజ్ లతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాయి. ఈ మోసాలను అరికట్టేందుకే సంచార్ సాథీ యాప్ ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

మొబైల్ ఫోన్లలో డీఫాల్ట్ గా ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు వీలుకలుగుతుందని పేర్కొంది. ఇందుకోసమే సంచార్ సాథీ యాప్ ను ఇన్ స్టాల్ చేయాలని మొబైల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. కాగా, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై మొబైల్ తయారీ కంపెనీలు ఇంకా స్పందించలేదు.
Sanchar Saathi App
Priyanka Gandhi
KC Venugopal
Cyber Crime India
Mobile Security
Data Privacy India
Government Surveillance
Digital Safety
Mobile Phone Security
Cyber Fraud

More Telugu News