కనిపించని ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్‌లో హై టెన్షన్.. అదియాలా జైలు ముట్టడికి పీటీఐ పిలుపు

  • ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించకపోవడంపై పీటీఐ ఆందోళన
  • నేడు అదియాలా జైలు, ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద నిరసనలకు పిలుపు
  • ఇమ్రాన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ప్రభుత్వం సెక్షన్ 144 విధింపు
  • కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని పీటీఐ ఆరోపణ
  • ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారని, బదిలీ చేయలేదని స్పష్టం చేసిన జైలు వర్గాలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలకు, కుటుంబ సభ్యులకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి నిరసనగా నేడు ఇస్లామాబాద్ హైకోర్టు, రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల ఆందోళనలు చేపట్టనున్నట్లు పీటీఐ ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో ప్రభుత్వం ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మూడు రోజుల పాటు సెక్షన్ 144 విధించింది.

ఈ నిరసనల గురించి పీటీఐ నేత అసద్ ఖైసర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు తొలుత ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద సమావేశమై, అక్కడి నుంచి అదియాలా జైలు వరకు ర్యాలీగా వెళ్తారని తెలిపారు. "ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జైలు అధికారులు అమలు చేయడం లేదు. అందుకే నిరసన చేపట్టాలని నిర్ణయించాం" అని ఆయన స్పష్టం చేశారు.

గత కొన్ని వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అధికారులు అనుమతించడం లేదు. ఇటీవల ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రికి సైతం ఎనిమిదోసారి కూడా ఇమ్రాన్‌తో భేటీకి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన జైలు బయట బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అదియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి ఎక్కడికీ తరలించలేదని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిరాధారమని స్పష్టం చేశారు. అవినీతి, ఉగ్రవాదం వంటి పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే.


More Telugu News