Pankaj Choudhary: మూలవేతనంలో డీఏను కలిపే ప్రతిపాదన... క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Pankaj Choudhary Clarifies DA Merger Proposal in Basic Pay
  • బేసిక్ పేలో డీఏ విలీనంపై కేంద్రం కీలక ప్రకటన
  • పరిశీలనలో అలాంటి ప్రతిపాదనేదీ లేదన్న కేంద్ర మంత్రి
  • 50 శాతం డీఏను విలీనం చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
  • 6వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత విలీన నిబంధన తొలగింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (డీఏ) విలీనంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. డీఏను మూల వేతనంలో (బేసిక్ పే) కలిపే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఇటీవల 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. పెరిగిన ధరల నుంచి ఉపశమనం కోసం సుమారు 50 శాతానికి చేరిన డీఏను తక్షణం మూల వేతనంలో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల బేసిక్ జీతం పెరుగుతుంది. దానిపై కొత్త డీఏను లెక్కిస్తే భవిష్యత్తులో వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది.

కొత్త పే కమిషన్ వచ్చినప్పుడు, 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' ఆధారంగా జీతాలను సవరిస్తారు. బేసిక్ పే ఎక్కువగా ఉంటే, జీతం పెంపు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు, 7వ వేతన సంఘం సిఫారసులతో కనీస వేతనం రూ.18,000గా ఉంది. 50 శాతం డీఏను విలీనం చేస్తే, అది రూ.27,000 అవుతుంది. అప్పుడు 8వ వేతన సంఘం సిఫారసు చేసే పెంపు ఈ పెరిగిన వేతనంపైనే లెక్కిస్తారు.

ఐదో వేతన సంఘం (5th Pay Commission) కాలంలో డీఏ 50 శాతం దాటితే దానిని మూల వేతనంలో కలపాలనే నిబంధన ఉండేది. దాని ప్రకారం 2004లో ప్రభుత్వం డీఏను విలీనం చేసింది. అయితే, ఆరో వేతన సంఘం ఆ నిబంధనను తొలగించింది. అప్పటి నుంచి డీఏను బేసిక్ పేలో కలపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తాజా ప్రకటనతో స్పష్టమైంది. ఈ ప్రకటనతో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. 
Pankaj Choudhary
Central Government Employees
DA Merger
Dearness Allowance
8th Pay Commission
Basic Pay
Salary Hike
Fitment Factor
5th Pay Commission
Pensioners

More Telugu News