Duvvuri Subbarao: పోటాపోటీ ఉచితాలు దేశానికి ప్రమాదకరం: ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హెచ్చరిక

Duvvuri Subbarao warns freebies are dangerous for India
  • ఉచితాలు రాజకీయ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్య
  • అప్పులు చేసి తాయిలాలు పంచడం భవిష్యత్ తరాలపై భారం
  • ప్రధాని మోదీ సైతం ఇప్పుడు ఉచితాల బాట పట్టారని విమర్శ
రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రకటిస్తున్న ఉచిత పథకాల సంస్కృతిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత హామీలు ఎన్నికల్లో గెలిపించవచ్చేమో గానీ, దేశాన్ని మాత్రం నిర్మించలేవని ఆయన స్పష్టం చేశారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో రాసిన ఒక వ్యాసంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు ‘రేవ్‌డీ కల్చర్’ (ఉచితాల సంస్కృతి)ని తీవ్రంగా విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇప్పుడు ఎన్నికల లాభాల కోసం అవే హామీలు ఇస్తున్నారని సుబ్బారావు ఎద్దేవా చేశారు. ఇది ఏదో ఒక పార్టీ వైఫల్యం కాదని, మొత్తం రాజకీయ వ్యవస్థలోనే పాతుకుపోయిన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. హామీలు నమ్మశక్యంగా లేనప్పుడు ప్రజలు వాటిని విశ్వసించడం మానేస్తారని పేర్కొన్నారు.

ప్రతి ఉచిత పథకం ఒక రాజకీయ వైఫల్యానికి అంగీకారమేనని ఆయన వ్యాఖ్యానించారు. "ప్రజలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించలేకపోతున్నాం, అందుకే ఈ తాయిలాలతో సర్దుకుపోవాలి" అని నేతలు చెప్పడమే దీని అర్థమని వివరించారు. దేశంలో ఉద్యోగాల కల్పన, ఉత్పాదకత పెంపు వంటి కీలక అంశాలపై చర్చ జరగడం లేదని, వాటి స్థానంలో నగదు బదిలీ హామీలపై చర్చ జరుగుతోందని విశ్లేషించారు.

ఈ ఉచితాల కోసం ప్రభుత్వాలు అప్పులు తీసుకురావడం మరింత ఆందోళన కలిగించే విషయమని, ఇది భవిష్యత్ తరాల పన్ను చెల్లింపుదారులపై భారం మోపడమేనని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఆర్థిక దుస్సాహసాలను అడ్డుకోవాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయని అన్నారు. పేదలకు వ్యతిరేకులుగా ముద్ర పడుతుందన్న భయంతో ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను విమర్శించే సాహసం చేయలేకపోతోందని పేర్కొన్నారు.
Duvvuri Subbarao
RBI
Reserve Bank of India
freebies culture
election promises
Indian economy
Narendra Modi
Times of India
economic burden
political parties

More Telugu News