Mohammad Sameena Khaseem: సర్పంచ్ పదవికి రూ.73 లక్షల వేలం.. గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవ తీర్మానం!

Mohammad Sameena Khaseem wins Sarpanch post in auction for Rs 73 lakh
  • నల్గొండ జిల్లా బంగారిగడ్డ గ్రామంలో చోటుచేసుకున్న వైనం 
  • గ్రామాభివృద్ధి కోసం రూ.73 లక్షలు వెచ్చిస్తానని హామీ
  • వేలంలో పదవిని దక్కించుకున్న మహమ్మద్ సమీనా ఖాసీం
  • పోటీ నుంచి తప్పుకున్న ఇతర అభ్యర్థులు
  • అధికారికంగా ఖరారు కావాల్సి ఉన్న ఏకగ్రీవం
నల్గొండ జిల్లాలో ఒక గ్రామ సర్పంచ్ పదవిని వేలం వేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామాభివృద్ధి కోసం ఏకంగా రూ.73 లక్షలు వెచ్చిస్తానని హామీ ఇచ్చిన అభ్యర్థికి గ్రామస్థులు మద్దతు పలికారు. దీంతో ఆ పంచాయతీ ఏకగ్రీవం అయింది.

వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లాలోని బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఎన్నికల కంటే గ్రామాభివృద్ధే ముఖ్యమని భావించిన గ్రామస్థులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు గ్రామస్థులంతా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా, ముగ్గురు అభ్యర్థులు గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి, ఇతర పనులకు తాము నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో గ్రామ పెద్దలు వారి మధ్య వేలం నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ.73 లక్షలు ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆమె ఆఫర్‌కు మిగిలిన అభ్యర్థులందరూ అంగీకరించి, తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీంతో బంగారిగడ్డ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయింది. దీనిపై ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 
Mohammad Sameena Khaseem
Bangari Gadda
Nalgonda district
Sarpanch election
Village development
Auction election
Unanimous resolution
Telangana elections
Kanaka Durga Temple
Gram Panchayat

More Telugu News