APSDMA: రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు: ఏపీఎస్డీఎంఏ అలర్ట్

APSDMA Issues Heavy Rain Alert for Nellore Tirupati Districts
  • తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి దగ్గరగా 'దిత్వా' తుపాను
  • గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనం
  • రానున్న మూడు గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం
  • దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వర్షాల ప్రభావం
  • తమిళనాడు తీరానికి సముద్రపు అలల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం (డిసెంబర్ 1) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు, అధికారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

అలాగే, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ జిల్లాల్లోని రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

ఇక కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలను కోరారు.

బలహీనపడనున్న తుపాను

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుపాను, తమిళనాడు-పుదుచ్చేరి తీరానికి అతి సమీపంలో కేంద్రీకృతమై ఉంది. గడచిన 6 గంటలుగా ఇది గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోంది. ఐఎండీ అంచనాల ప్రకారం, 'దిత్వా' రానున్న మూడు గంటల్లో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, రేపు ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఈ రాత్రికి ఇది తీరానికి మరింత దగ్గరగా (సుమారు 30 కి.మీ.) రానుంది. చెన్నై, కారైకాల్‌లోని డాప్లర్ రాడార్ల ద్వారా తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.


APSDMA
Nellore
Tirupati
heavy rainfall alert
Andhra Pradesh rains
weather forecast
cyclone Ditwa
IMD forecast
coastal Andhra
rain alert

More Telugu News