Jagan Mohan Reddy: ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాడాలని వైసీపీ ఎంపీలకు జగన్ పిలుపు

Jagan Calls YSRCP MPs to Fight for AP Rights in Parliament
  • రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • రైతుల సమస్యలపై పార్లమెంటులో గట్టిగా పోరాడాలని ఎంపీలకు జగన్ సూచన
  • తుపాను నష్టపరిహారం, కనీస మద్దతు ధర కోసం పట్టుబట్టాలని ఆదేశం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపు
  • ఉపాధి హామీ కార్డుల తొలగింపు, శాంతిభద్రతల క్షీణతపై గళమెత్తాలని దిశానిర్దేశం
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంతో పాటు, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న  అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో సమావేశమయ్యారు. తుఫాను నష్టంతో పాటు, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) లభించకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.

'మొంథా' తుపాను కారణంగా కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, సర్వం కోల్పోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయని జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా నేరుగా పంటలను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించిందని, ఇప్పుడు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతులు దళారుల చేతుల్లో నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. 

వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చి, మామిడి వంటి అన్ని ప్రధాన పంటలకు మద్దతు ధర పడిపోయిందని, దీనివల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలిపారు. పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించి, రైతులకు తక్షణమే అత్యవసర సహాయ నిధులతో పాటు, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రీమియం భారం లేకుండా ఉచిత పంటల బీమా అందించామని, ఇప్పుడు ఆ పథకాన్ని నిలిపివేయడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్ విమర్శించారు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందడం లేదని, ఈ-క్రాప్ నమోదును నిలిపివేయడంతో పరిహారం పొందేందుకు కూడా రైతులు అనర్హులుగా మారుతున్నారని అన్నారు. మిర్చి రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మోసం చేశారని, మామిడి రైతులను కూడా ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు.

ఇదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా 18.63 లక్షలతో సహా మొత్తం లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులను రద్దు చేయడంపై జగన్ మండిపడ్డారు. దీనివల్ల గ్రామీణ కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని, వెంటనే అర్హులైన వారి కార్డులను పునరుద్ధరించి, పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు. 

విశాఖ స్టీల్ ప్లాంటును ముక్కలు చేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్లాంటుకు సొంత గనులు కేటాయించి, వేలాది మంది కార్మికుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ఉపాధి కల్పన, హక్కుల పరిరక్షణ కోసం పార్లమెంటు వేదికగా గట్టిగా పోరాడాలని జగన్ తన ఎంపీలకు స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
YS Jagan
YSRCP
Andhra Pradesh
AP Rights
Parliament
Farmers Crisis
Minimum Support Price
Visakha Steel Plant
Employment Guarantee Scheme

More Telugu News