Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... 11 మంది దుర్మరణం

Tamil Nadu Road Accident Kills 11 Near Tirupathur
  • శివగంగ జిల్లా తిరుపత్తూర్ సమీపంలో ఘటన
  • కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో పెరగనున్న మృతుల సంఖ్య
  • వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద బస్సు ప్రమాదం
తమిళనాడులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడి వస్తుండగా... మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్‌కు ప్రయాణిస్తోంది. తిరుపత్తూర్ వద్దకు రాగానే ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను శివగంగ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబర్ 24న తెన్కాశి జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మరణించగా, 56 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్ రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Tamil Nadu Road Accident
Tamil Nadu
Road Accident
Tirupathur
Sivaganga
RTC Bus
MK Stalin
Tenkasi
Karaikudi
Dindigul

More Telugu News