Narendra Modi: భారత క్రీడారంగానికి ఇది 'సూపర్ హిట్' నెల: 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

Mann Ki Baat PM Modi highlights Indian sports victories
  • మహిళల క్రికెట్, కబడ్డీ ప్రపంచకప్‌ల విజయాలపై ప్రత్యేక అభినందనలు
  • అంధుల మహిళా క్రికెట్ జట్టు విజయం చరిత్రలో నిలిచిపోతుందన్న ప్రధాని
  • డెఫ్లింపిక్స్, వరల్డ్ బాక్సింగ్‌లోనూ పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు
  • విజేతల ధైర్యం, పట్టుదల దేశానికే స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
భారత క్రీడా రంగానికి గడిచిన నెల ఒక సూపర్ హిట్ నెలగా నిలిచిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 128వ ఎపిసోడ్‌లో ఆయన మాట్లాడుతూ.. పలు అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారత క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రికెట్ నుంచి కబడ్డీ, బాక్సింగ్ వరకు వివిధ రంగాల్లో మన అథ్లెట్లు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, "భారత క్రీడా రంగం పరంగా ఈ నెల ఒక సూపర్ హిట్‌గా నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవడంతో ఈ నెల ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా క్రీడా మైదానాల్లో మన వాళ్ల జోరు కొనసాగింది. కొద్ది రోజుల క్రితం టోక్యోలో జరిగిన డెఫ్లింపిక్స్‌లో భారత క్రీడాకారులు 20 పతకాలు సాధించి, ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు" అని తెలిపారు.

అంతేకాకుండా, భారత మహిళా కబడ్డీ జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించిన మన అమ్మాయిలు, గ్రూప్ స్టేజ్‌లోని అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించారు. సెమీ-ఫైనల్‌లో ఇరాన్‌పై 33–21 స్కోరుతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. తుదిపోరులో చైనీస్ తైపీ జట్టును 35–28 తేడాతో ఓడించి విశ్వవిజేతగా నిలిచారు. "మన మహిళా క్రీడాకారులు కబడ్డీ ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించారు. టోర్నమెంట్ అంతటా వారి అద్భుతమైన ప్రదర్శన ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుంది" అని మోదీ పేర్కొన్నారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లోనూ భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నమెంట్‌లో మన క్రీడాకారులు మొత్తం 20 పతకాలు సాధించారు. ఇందులో తొమ్మిది స్వర్ణాలు, ఆరు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.

అయితే, ఈ విజయాలన్నింటిలోనూ అంధుల మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం అత్యంత ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ అభివర్ణించారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి కప్ గెలవడం వారి అసామాన్య ప్రతిభకు నిదర్శనమని అన్నారు. ఈ విజయం తర్వాత తాను జట్టు సభ్యులను తన నివాసంలో కలుసుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు.

"మిత్రులారా, వీటన్నింటికన్నా ఎక్కువగా మన మహిళల అంధుల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంపై చర్చ జరుగుతోంది. విశేషమేమిటంటే, ఈ టోర్నమెంట్‌లో మన జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచింది. ఈ జట్టులోని ప్రతి క్రీడాకారిణిని చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారు. కేవలం రెండు రోజుల క్రితమే నేను ఈ జట్టును ప్రధానమంత్రి నివాసంలో కలిశాను. నిజంగా, ఈ జట్టు ధైర్యం, పట్టుదల మనకు ఎంతో నేర్పుతాయి. మన క్రీడా చరిత్రలోని గొప్ప విజయాలలో ఇదొకటి. ఇది ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది" అని ప్రధాని మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు. ఈ విజయాలు భారత క్రీడాకారుల అంకితభావానికి, కఠోర శ్రమకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
Narendra Modi
Mann Ki Baat
Indian sports
sports achievements
womens kabaddi world cup
blind cricket world cup
deaflympics
world boxing cup
Indian athletes
sports news

More Telugu News