KTR: కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

KTR Reacts to Kondagattu Fire Accident Expresses Shock
  • ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే నష్టం పెరిగిందని కేటీఆర్ విమర్శ
  • బాధిత కుటుంబాలకు రూ. 30 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్
  • బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే భారీ ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్, నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో సుమారు 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయి, దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం అప్పులు చేసి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయని విచారం వ్యక్తం చేశారు.

అగ్నిమాపక శకటాలు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోకపోవడమే నష్టం పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల ఫైరింజన్ మరమ్మతులో ఉండటం, వచ్చిన మరో ఇంజన్ పనిచేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించకపోతే, పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. 
KTR
Kondagattu fire accident
Telangana fire
Sunke Ravishankar
BRS party
Kondagattu Anjaneya Swamy Temple
Jagityala
Fire accident compensation
Telangana news
Political news

More Telugu News