Donald Trump: వెనెజువెలాపై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి.. ఎయిర్ స్పేస్ క్లోజ్ అంటూ ట్రంప్ ప్రకటన

Donald Trump Announces Potential US Action Against Venezuela Airspace Closure
  • అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు
  • త్వరలో వెనెజువెలా భూభాగంపై ఆపరేషన్లు చేపడతామని రెండు రోజుల క్రితమే వెల్లడి
  • డ్రగ్ మాఫియాపై పోరాటం తప్పదని పలుమార్లు హెచ్చరిక
  • ఇది తమ సార్వభౌధికారాన్ని కించపరచడమేనన్న వెనెజువెలా
వెనెజువెలా గగనతలాన్ని పూర్తిగా మూసివేసినట్లు భావించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయంగా ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ఏ క్షణంలోనైనా వెనెజువెలాపై దాడులు జరిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలో వెనెజువెలా భూభాగంపై ఆపరేషన్లు చేపడతామని ట్రంప్ రెండు రోజుల క్రితమే వెల్లడించారు. తాజాగా ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసినట్లు భావించాలని ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా దాడులు మొదలు కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్ మాఫియాకు వెనెజువెలా స్వర్గధామంగా మారిందని, సముద్ర మార్గంలో అమెరికాలోకి భారీ ఎత్తున డ్రగ్స్ చేరవేస్తున్నారని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. డ్రగ్ మాఫియాను నిర్మూలిస్తామని పలుమార్లు హెచ్చరికలు కూడా ఆయన జారీ చేశారు. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో వెనెజువెలాతో పాటు అమెరికాలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ట్రంప్ పెట్టిన పోస్ట్ ఇదే..
‘విమానయాన సంస్థలు, పైలట్లు, మానవ అక్రమణదారులు, డ్రగ్ డీలర్లు.. అందరూ జాగ్రత్తగా వినండి. వెనెజువెలా సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో గగనతలాన్ని పూర్తిగా మూసివేసినట్లు భావించండి’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.

వెనెజువెలా ఏమంటోందంటే..
ట్రంప్ ప్రకటనపై వెనెజువెలా తాజాగా స్పందించింది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ సార్వభౌమాధికారాన్ని కించపరుస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు చేపడుతున్నారని ఆరోపించింది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో తమ దేశానికి విమాన సర్వీసులను నిలిపివేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనెజువెలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా దేశాలకు చెందిన విమానయాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ‘స్టేట్ టెర్రరిజం’లో ఈ విమానయాన సంస్థలు కూడా భాగమయ్యాయని మదురో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Donald Trump
Venezuela
US Venezuela conflict
Venezuela air space
Drug trafficking
US military
Maduro government
State terrorism
Caribbean sea
Venezuela flights banned

More Telugu News