Indus Valley Civilization: వేల ఏళ్ల నాటి మిస్టరీ.. సింధు నాగరికత ఎందుకు అంతరించింది?: ఐఐటీ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి

Indus Valley Civilization Collapse IIT Study Reveals Drought as Key Factor
  • ఐఐటీ గాంధీనగర్ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు
  • వందేళ్లకు పైగా కొనసాగిన కరవులతో నగరాలను వీడిన ప్రజలు
  • ఇది ఆకస్మిక పతనం కాదు, నెమ్మదిగా క్షీణించిన నాగరికత అని వెల్లడించిన పరిశోధకులు
భారతదేశ చరిత్రలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటైన సింధు లోయ నాగరికత పతనం వెనుక ఉన్న కారణాలను ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు ఛేదించారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా విలసిల్లిన ఆ మహా నాగరికత అంతరించిపోవడానికి వరుసగా సంభవించిన తీవ్రమైన, సుదీర్ఘమైన కరవులే ప్రధాన కారణమని తమ పరిశోధనలో తేల్చారు. ఈ కరవుల వల్లే హరప్పా, మొహెంజొదారో, రాఖీగఢీ వంటి సుసంపన్నమైన నగరాలను ప్రజలు విడిచిపెట్టి వెళ్లారని వారు నిర్ధారించారు.

సుమారు 5,000 నుంచి 3,500 ఏళ్ల క్రితం వాయవ్య భారతదేశం, పాకిస్థాన్ ప్రాంతాల్లో సింధు-సరస్వతి నాగరికత వర్ధిల్లింది. అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థలు, అభివృద్ధి చెందిన లోహపు పనితనంతో ప్రపంచంలోని తొలి పట్టణ నాగరికతలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. అయితే, ఇంతటి ఘన చరిత్ర కలిగిన నాగరికత ఎందుకు అంతరించిపోయిందనేది పురావస్తు శాస్త్రవేత్తలకు శతాబ్దాలుగా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన విమల్ మిశ్రా నేతృత్వంలోని బృందం చేసిన తాజా అధ్యయనం ఈ మిస్టరీపై కొత్త వెలుగునిచ్చింది. వీరు పురాతన వాతావరణ రికార్డులు, భూగర్భ ఆధారాలు, క్లైమేట్ మోడల్స్‌ను విశ్లేషించారు. వారి పరిశోధన ప్రకారం, 4,450 నుంచి 3,400 ఏళ్ల మధ్య కాలంలో నాలుగు భారీ కరవులు సంభవించాయి. ఒక్కో కరువు 85 ఏళ్లకు పైగా కొనసాగింది. వీటిలో అత్యంత తీవ్రమైన కరువు ఏకంగా 164 ఏళ్లపాటు కొనసాగి, సింధు లోయ ప్రాంతంలోని 91 శాతానికి పైగా భూభాగాన్ని ప్రభావితం చేసింది.

ఈ కరవుల కారణంగా వ్యవసాయం దెబ్బతిని, నీటి కొరత తీవ్రమైంది. దీంతో ప్రజలు తొలుత సింధు నదికి దగ్గరగా వలస వెళ్లారు. గోధుమ, బార్లీ వంటి పంటల స్థానంలో కరవును తట్టుకునే మిల్లెట్లను పండించడం ప్రారంభించారు. అయినప్పటికీ, శతాబ్దాల పాటు కొనసాగిన కరవుల ధాటికి తట్టుకోలేక, చివరికి పెద్ద నగరాలను వదిలి చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాలకు చెదిరిపోయారు. ఇది ఆకస్మిక పతనం కాదని, వాతావరణ మార్పుల వల్ల నెమ్మదిగా జరిగిన క్షీణత అని పరిశోధకులు తమ అధ్యయనంలో స్పష్టం చేశారు. ఈ అధ్యయన వివరాలను ‘కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
Indus Valley Civilization
Harappan Civilization
IIT Gandhinagar
Vimal Mishra
Drought
Climate Change
Ancient India
Mohenjo-daro
Rakigarhi
Indus River

More Telugu News