Saurabh Gaur: గుంటూరు జీజీహెచ్‌లో హైటెన్షన్.. రోగిలా వచ్చిన ఆరోగ్య కార్యదర్శి!

Saurabh Gaur Surprise Visit to Guntur GGH as Patient
  • సాధారణ రోగిలా గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లిన ఆరోగ్య కార్యదర్శి
  • జ్వరమంటూ ఓపీ చీటీ తీసుకుని క్యూలో నిల్చున్న సౌరభ్ గౌర్
  • గంట తర్వాత విషయం తెలిసి విస్తుపోయిన వైద్య సిబ్బంది
  • వైద్యుల పనితీరు, రోగులతో ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో శనివారం జరిపిన ఆకస్మిక తనిఖీ తీవ్ర కలకలం రేపింది. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఒక సాధారణ రోగిలా ఆసుపత్రికి రావడంతో వైద్య సిబ్బంది విస్తుపోయారు.

శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సౌరభ్ గౌర్ జీజీహెచ్ ఓపీ విభాగానికి చేరుకున్నారు. తనకు జ్వరంగా ఉందని చెప్పి ఓపీ చీటీ తీసుకున్నారు. అనంతరం వైద్యుడిని సంప్రదించి, తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఫార్మసీ వద్ద సాధారణ రోగులతో పాటు క్యూలో నిల్చుని మందులు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు గంట పాటు ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు.

గంట తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది హుటాహుటిన సౌరభ్ గౌర్ వద్దకు పరుగులు తీశారు. అప్పటికే ఆయన ఆర్థోపెడిక్ ఓపీ వద్ద ఉన్నారు. సూపరింటెండెంట్‌ వచ్చి నమస్కరించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

అనంతరం సౌరభ్ గౌర్ సూపరింటెండెంట్‌ను వెంటబెట్టుకుని ల్యాబ్, మెడికల్ ఓపీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ పీజీ వైద్య విద్యార్థి రోగులతో కటువుగా మాట్లాడటాన్ని గమనించి, అతడిని పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. మందుల చీటీలపై సరైన విధానం పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యుల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి వైద్యుడికి సంబంధించి ‘కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్‌’ (పనితీరు సూచిక) వివరాలు తీసుకున్నారు.
Saurabh Gaur
Guntur GGH
Government General Hospital Guntur
Andhra Pradesh health secretary
hospital surprise visit
hospital inspection
medical services
healthcare
patient experience
hospital administration

More Telugu News