Pemmasani Chandrasekhar: వీధిపోటు, వాస్తు సమస్యలకు చెక్.. అమరావతి రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామన్న పెమ్మసాని

Amaravati Farmers to Get Alternative Sites for Vaastu Issues Says Pemmasani
  • అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ భేటీ
  • వాస్తు సమస్యలున్న రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయింపు
  • నెల రోజుల్లో హెల్త్ కార్డులు, పెన్షన్ల సమస్యల పరిష్కారానికి హామీ
రాజధాని అమరావతి రైతుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తొలిసారి సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్లాట్ల కేటాయింపులో సమస్యలు, ఆరోగ్య పథకాలు, పెన్షన్ల పునరుద్ధరణ వంటి అంశాలపై కూలంకషంగా చర్చించారు.

సమావేశం అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాజధాని పరిధిలో 1286 ప్లాట్లకు వీధిపోటు సమస్యలు ఉన్నాయని, మరో 156 మంది రైతులు వాస్తుపరమైన కారణాలతో అసంతృప్తిగా ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. వాస్తు సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిలిచిపోయిన హెల్త్ కార్డులు, పెన్షన్ల వంటి సమస్యలను నెల రోజుల్లోగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసైన్డ్, లంక భూముల సమస్యలను మిగతా భూముల నుంచి వేరు చేసి, కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ.. జరీబు-నాన్ జరీబు, గ్రామకంఠం భూముల సమస్యలపై కూడా సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. వచ్చే కేబినెట్‌లోనే అసైన్డ్, లంక భూముల సమస్యలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాజధాని గ్రామాల్లో హెచ్‌డీ లైన్లు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి రెండు వారాలకు ఒకసారి వారితో సమావేశమవుతామని త్రిసభ్య కమిటీ ప్రకటించింది.
Pemmasani Chandrasekhar
Amaravati farmers
Andhra Pradesh government
Capital region farmers issues
Plot allotment problems
Vaastu problems
Street facing plots
Pension restoration
Health cards

More Telugu News