Jagan Mohan Reddy: శబరిమల యాత్రలో జగన్ బ్యానర్లు.. హిందూ సంఘాల ఆగ్రహం

Jagan Banners in Sabarimala Yatra Spark Controversy
  • శబరిమల యాత్రలో జగన్ ఫ్లెక్సీలతో వైసీపీ నేతల ప్రదర్శన
  • పెందుర్తి నియోజకవర్గానికి చెందిన నేతల అత్యుత్సాహం
  • పవిత్ర యాత్రలో రాజకీయాలు వద్దంటూ హిందూ సంఘాల అభ్యంతరం
అయ్యప్ప స్వామి దీక్షను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. 41 రోజుల పాటు కఠోర నియమాలతో మణికంఠుడిని ఆరాధిస్తారు. అయితే, ఈ పవిత్రమైన దీక్షలోనూ కొందరు రాజకీయ భక్తిని ప్రదర్శిస్తూ వివాదాలకు కారణమవుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన వైసీపీ నేతలు శబరిమల యాత్రలో జగన్ ఫొటోలతో బ్యానర్లు ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు అయ్యప్ప మాల ధరించి శబరిమలకు బయల్దేరారు. ఈ యాత్రలో వారు జగన్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇతర స్థానిక నేతల ఫొటోలతో కూడిన మూడు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. 'జగన్ 2.0' అంటూ రాసి ఉన్న బ్యానర్లతో 'జై జగన్' అని నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇలాంటి ఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన వైసీపీ అయ్యప్ప స్వాములు కూడా ఇదే విధంగా జగన్ బ్యానర్లు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఆ ఘటన మరువక ముందే మరోసారి పెందుర్తిలో పునరావృతం కావడం గమనార్హం.

పవిత్రమైన శబరి యాత్రలో రాజకీయ నేతల ఫొటోలు, ఫ్లెక్సీలతో హడావుడి చేయడంపై అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భక్తితో చేయాల్సిన యాత్రను రాజకీయ ప్రచారానికి వాడుకోవడం సరికాదని మండిపడుతున్నాయి. ఇలాంటి చర్యలను అరికట్టాలని వారు కోరుతున్నారు.
Jagan Mohan Reddy
Sabarimala
Sabarimala Yatra
YCP
Hindu Sangham
Ayyappa Swamy
Andhra Pradesh Politics
Gudivada Amarnath
Pendurthi
Political Pilgrimage

More Telugu News