ప్రజారాజధాని అమరావతిలో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టాం: సీఎం చంద్రబాబు

  • అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పునాది రాయి వేసిన సీఎం చంద్రబాబు
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ సంస్థలకు భూముల కేటాయింపు
  • అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
  • వికసిత భారత్‌లో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం
ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిని ప్రముఖ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చే దిశగా శుక్రవారం కీలక ముందడుగు పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

"ప్రజారాజధాని అమరావతిని ఒక శక్తివంతమైన ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఈ రోజు ఒక చారిత్రక ముందడుగు వేశాం. గౌరవనీయ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఈ కార్యక్రమానికి స్వాగతించడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఆమె చేతుల మీదుగా 15 జాతీయ బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ భీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

అమరావతిని ఒక ఆధునిక ఆర్థిక కేంద్రంగా నిలపాలన్న మా ప్రణాళికలో భాగంగా, ఈ సంస్థలన్నింటికీ ప్రణాళికాబద్ధమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భూమిని కేటాయించాం. ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరై, మమ్మల్ని ప్రోత్సహించిన గౌరవనీయ కేంద్ర ఆర్థిక మంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, స్వర్ణాంధ్ర ప్రగతికి అమరావతి ఒక మూలస్తంభంగా నిలుస్తుంది. అంతేకాకుండా, వికసిత భారత్ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించే గర్వించదగిన, క్రియాశీల నగరంగా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
.


More Telugu News