Pithapuram Municipality: పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు

Pithapuram Municipality Five Officers Fired Over Misappropriation
  • గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు 
  • విజిలెన్స్ విచారణలో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ
  • పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారని ఆరోపణలు
పిఠాపురం మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఐదుగురు ఇంజనీరింగ్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా పనిచేసిన పి. వంశీ అభిషేక్, కె. రత్నవల్లి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. భవానీ శంకర్, మున్సిపల్ టౌన్ ప్లానర్ ఎంటీ హుస్సేన్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహరావులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గత వైకాపా ప్రభుత్వ హయాంలో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పిఠాపురం మున్సిపాలిటీకి 55 పనుల కోసం రూ. 7.73 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు వార్డుల్లో డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి 28 పనులను రూ. 3.19 కోట్ల వ్యయంతో చేపట్టారు. అయితే, ఈ పనుల్లో నాణ్యత లోపించిందని, కొన్ని చోట్ల పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.

ఈ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు జరిపిన విచారణలో ఇంజనీరింగ్ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. పనుల నాణ్యత లోపించడంతో పాటు, చేయని పనులకు బిల్లులు చెల్లించినట్లు తేలడంతో, నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఐదుగురు అధికారులపై చర్యలు చేపట్టింది. 
Pithapuram Municipality
Andhra Pradesh Government
Fund Misappropriation
Engineering Officers
Vigilance Inquiry
YSRCP Government
Financial Irregularities
Municipality Funds

More Telugu News