Nadendla Manohar: ధాన్యం కొనుగోలు వేగవంతం చేశాం... దళారులను నమ్మి మోసోవద్దు: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Paddy Procurement Accelerated in Andhra Pradesh
  • రాష్ట్రంలో ఇప్పటివరకు 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే రూ. 1713 కోట్లు జమ
  • ధాన్యం కొనుగోలు చేసిన 4-6 గంటల్లోనే నగదు చెల్లింపు
  • గత ప్రభుత్వ బకాయిలు రూ. 1674 కోట్లు చెల్లించిన కూటమి సర్కార్
  • దళారులపై రైతులను అప్రమత్తం చేసిన మంత్రి నాదెండ్ల
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేశామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరకే ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. గురువారం విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో నేటి వరకు 8,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రైతుల ఖాతాల్లో రూ. 1,713 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 4 నుంచి 6 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, రైతులు రూపాయి కూడా నష్టపోకుండా కల్లాల వద్దే ధాన్యం కొంటున్నామని స్పష్టం చేశారు.

కొంతమంది నేతలు ధాన్యం కొనుగోళ్లపై అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రైతులు అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత ప్రభుత్వం రైతులకు రూ. 1,674 కోట్ల బకాయిలు పెడితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ బకాయిలన్నింటినీ చెల్లించిందని గుర్తుచేశారు. ఈ సీజన్‌లో ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్షా 7 వేల టన్నుల ధాన్యం సేకరించడం ఒక రికార్డు అని అన్నారు. గోదావరి జిల్లాల్లోనూ లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 

క్షేత్రస్థాయిలో అధికారులు రేయింబవళ్లు కష్టపడుతుంటే, వారి మనోధైర్యం దెబ్బతినేలా కొందరు విమర్శలు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వం 2022-23లో 3,33,155 మెట్రిక్ టన్నుల ధాన్యం కొని రూ. 679.79 కోట్లు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఇప్పటికే అంతకు రెట్టింపు స్థాయిలో కొనుగోళ్లు జరిపిందని పోల్చి చెప్పారు.

రవాణా వ్యవస్థను కూడా పటిష్టం చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24లో కేవలం 455 లారీలు నమోదు కాగా, తమ ప్రభుత్వంలో ఇప్పుడు 2,715 లారీలు నమోదు చేసుకున్నాయని వివరించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో రవాణా వాహనాల బకాయిలు రూ. 9 కోట్లు చెల్లించామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో 7.53 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో అదనంగా మరో లక్ష సంచులను సిద్ధం చేశామని చెప్పారు.

వాతావరణ మార్పుల దృష్ట్యా రైతుల ఆందోళనను గమనించి మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియను ముందే ప్రారంభించామన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం 30వ తేదీ తర్వాత కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో వర్ష సూచన ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వర్షాల నుంచి పంటను కాపాడేందుకు కౌలు రైతులకు టార్పాలిన్ పట్టాలు సిద్ధంగా ఉంచామన్నారు. 

దళారులు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు ధాన్యం కొనే ప్రయత్నం చేస్తారని, ప్రభుత్వం 75 కిలోల బస్తాకు రూ. 1792 మద్దతు ధర చెల్లిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.
Nadendla Manohar
Paddy Procurement
Andhra Pradesh
Farmers
MSP
Civil Supplies
Agriculture
Chandrababu Naidu
Rythu Seva Kendram
e-crop

More Telugu News