ఈ సంస్థతో జాగ్రత్త... ఇన్వెస్టర్లను హెచ్చరించిన బీఎస్ఈ

  • స్టాక్ మార్కెట్ మదుపరులకు అలర్ట్
  • అనుమతులు లేకుండా పెట్టుబడి సలహాలు ఇస్తూ నిధులు సేకరిస్తున్న ఈజీఇన్వెస్ట్
  • గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే స్కీములను నమ్మవద్దని మదుపరులకు బీఎస్ఈ సూచన
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. 'ఈజీఇన్వెస్ట్' (EZInvest) అనే అనధికారిక సంస్థ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పెట్టుబడి, ట్రేడింగ్ సలహాలు ఇస్తూ ప్రజల నుంచి నిధులు సేకరిస్తోందని బీఎస్ఈ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

ఈజీఇన్వెస్ట్ సంస్థకు సెబీ వద్ద గానీ, తమ ఎక్స్ఛేంజ్‌లో గానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని బీఎస్ఈ స్పష్టం చేసింది. అందువల్ల, పెట్టుబడిదారులు ఏవైనా సలహాలు పాటించే ముందు, సంబంధిత సలహాదారుల గుర్తింపు, రిజిస్ట్రేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కోరింది. ఎక్స్ఛేంజ్‌లో రిజిస్టర్ అయిన మధ్యవర్తుల వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది.

స్టాక్ మార్కెట్‌లో గ్యారెంటీ లేదా హామీతో కూడిన రాబడి ఇస్తామని చెప్పే ఏ పథకాన్ని నమ్మవద్దని బీఎస్ఈ తేల్చిచెప్పింది. చట్టప్రకారం అలాంటి హామీలు ఇవ్వడం నిషేధమని గుర్తు చేసింది.

గత నెలలో కూడా బీఎస్ఈ ఇలాంటి హెచ్చరికే జారీ చేసింది. కొందరు కేటుగాళ్లు బీఎస్ఈ ఉన్నతాధికారుల ఫోటోలను ఉపయోగించి నకిలీ సోషల్ మీడియా ఐడీలు సృష్టించి, వెల్త్ అడ్వైజరీ పేరుతో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని అప్పట్లో వెల్లడించింది. బీఎస్ఈ అధికారులు ఎలాంటి వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు అందించరని, ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దని మరోసారి స్పష్టం చేసింది. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సమాచార ప్రామాణికతను సరిచూసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచించింది.


More Telugu News